తెలంగాణలో టిఆర్ఎస్ను విమర్శించాలంటే చాలామంది వెనక ముందు తటపటాయించిన దశ ఒకటుండింది. వారు కూడా విమర్శలను సహించలేక విరుచుకుపడిన రోజులున్నాయి.విశృంఖలంగా మాట్లాడిన ఉదాహరణలున్నాయి. కాని ఆ పరిస్థితి ఇప్పడు మారిందనే చెప్పాలి. మామూలుగానే భిన్న రాజకీయ సామాజిక శక్తులకు నిలయమైన తెలంగాణలో ఏకపక్షం లేదా ద్విపక్షం చెల్లే పరిస్థితి వుండదు. కోదండరాం జెఎసి తిరుగుబాటు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బృందం మహాజన పాదయాత్ర, ముగింపులో గొప్ప సభ , మిర్చి రైతుల ఆందోళన, ధర్నాచౌక్ రణరంగం, నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి వర్గంతో కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుయాయుల ఘర్షణ వీటన్నిటిని బట్టి ఈ విషయం స్పష్టమవుతుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలు కూడా తమవైన వ్యూహాలకు పదను పెడుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ వ్యూహాల కన్నా వివిధ తరగతుల ప్రజలను మంచి చేసుకునే వరాలు ప్రకటించిన తర్వాత ఈ పరిణామం రావడం ఆసక్తికరం. వాటి ప్రభావం పరిమితమని దీన్నిబట్టే తెలస్తుంది. ఇటీవల ఆయని సినిమా కవులు రచయితలతో కూచుని పాటలు రాయండని అడిగారంటేనే పరిస్థితి తెలుస్తుంది. ఉద్యమ కాలంలో వుర్రూతలూపిన గద్దర్ విమలక్క వంటి వారు ప్రతిపక్షంలోనే వున్నారు. రసమయిబాలకిషన్వంటివారి ఆధ్వర్యంలో పాడే పొగడ్తలపై కెసిఆర్ స్వయంగా విసుక్కున్న సందర్బాలున్నాయి. మంత్రివర్గ విస్తరణ గురించి అదేపనిగా కథనాలు రావడం వెనక ఆశావహుల పాత్ర వుంది.అంటే జరక్కపోతే వారంతా అసమ్మతి వాదులౌతారు. రైతులకు సంబంధించిన అసంతృప్తి ఈ ప్రభుత్వానికి తీవ్రంగానే తాకనుంది. బిజెపికి కేంద్రంలో వత్తాసునిచ్చినా రాష్ట్రంలో వారు విమర్శలతో విరుచుకుపడుతూనే వున్నారు. కాబట్టి ఎంత గంభీరంగా మాట్లాడినా సరే రాజకీయ సవాలు తప్పదని టిఆర్ఎస్ నాయకులు లోలోపల ఒప్పుకుంటున్నారు. కెటిఆర్ వర్సెస్ హరీష్ చర్చ ఎప్పుడూ దీనికి అదనం.