యజ్ఞానికి యత్నమేంటయ్యా అంటే, కట్టెలు కొట్టుకొస్తే చాలన్నాడనీ వెనకటికో సామెత. ఎన్నికలు కూడా యజ్ఞమే. కాకపోతే, ఎన్నికలకు సిద్ధమయ్యే తీరు ఇంకోలా ఉంటుంది, అంతే! అయితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ యజ్ఞానికి సిద్ధమౌతున్న తీరు చూస్తుంటే ఔరా అనిపించకమానదు! నిజానికి, గతంలో పోల్చుకుంటే తెలంగాణ కాంగ్రెస్ లో కాస్త కొత్త ఊపు వచ్చింది. కారణం.. తెరాస సర్కారుపై మెల్లగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత కావొచ్చు, లేదంటే కాంగ్రెస్ సోలో పర్ఫార్మెన్స్ కావొచ్చు! ఈ మధ్య కొన్ని సర్వేల్లో రాష్ట్రంలో తెరాస తరువాత ప్రజాదరణ పొందుతున్న పార్టీగా కాంగ్రెస్ నిలిచిన మాట వాస్తవమే. అయితే, ఇదే సమయంలో కేసీఆర్ కు సమానమైన లేదా, రేవంత్ రెడ్డికి దరిదాపులకు దగ్గరగా ఉన్న కర్మిజ్మాటిక్ ఫేస్ ఆ పార్టీలో లేదన్నదవి వాస్తవం.
అయితే, ఈ వాస్తవాన్ని వదిలేసి వచ్చే ఎన్నికల్లో ఎవరెంత ఖర్చు పెట్టగలరో అనేది తెలుసుకునేందుకు అధిష్ఠానం ప్రయత్నిస్తోందా అన్నట్టుగా ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చిందట! ఇప్పటికే ఆ పార్టీలో దాదాపు అరడజను ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారు. వీరిలో ఎవరికి వారే సీఎం క్యాండిడేట్ అనుకుంటున్నారు. అయితే, ఉత్తమ్ కుమార్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి భారీ ఎత్తున నిధులు వస్తాయనీ, ఆయన ఖర్చు చేయగలరనీ వందల కోట్లైనా సమకూర్చగలరనీ కొన్ని వ్యాఖ్యానాలు వినిపించాయి. ఉత్తమ్ మద్దతు దారులు కూడా ఆయన అభ్యర్థత్వం బలపరచడానికి ఇదే కారణంగా ఆ మధ్య చెప్పారు కూడా! ఇక, కోమటిరెడ్డి సోదరులు కూడా ఖర్చుకు వెనకాడబోయేది లేదన్నట్టుగా వారూ ఓ ఫైవ్ హండ్రెడ్ సీ వరకూ తీస్తారట! డీకే అరుణ కూడా ఓ మూడొందల వరకూ ఖర్చుకి రెడీ అట! ఇక, మరికొందరు కూడా వంద ఖర్చు అంటే రెడీ అంటున్నారట! ఇలాంటి కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఏంటివి..? ఇవన్నీ కోట్లేనా డబ్బులేనా..? ఎన్నికలకు అంత ఖర్చు ఎందుకు అవుతుంది..? అయినా, వీరికి ఇన్నిన్ని కోట్లు ఎలా వస్తాయి..? ఆ రేంజిలో ఖర్చుకు సిద్ధం అంటే సామాన్యుడికి ఎలా ఉంటుంది చెప్పండీ! ఒకవేళ, ఎక్కువ కోట్లు ఖర్చుపెట్టగల సమర్థతనే నాయకత్వ లక్షణంగా హైకమాండ్ పరిగణిస్తోందేమో! లేదంటే, తమ సత్తా ఇదీ అంటూ అధిష్ఠానం ముందు టి. కాంగ్రెస్ నేతలు చేస్తున్న బల ప్రదర్శనేమో! ఇంతకీ, టి. కాంగ్రెస్ లో ప్రజాదరణ గల నాయకుడు ఎవరా అనే వెతుకులాట మానేసి, ఈ చర్చ దేనికో..?
ఏదేమైనా, ఇలాంటి చర్చలు.. ఇలాంటి అంకెలు.. అదీ ఎన్నికల నేపథ్యమై చర్చకు రావడం శోచనీయం. సొమ్ములే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని రాజకీయ పార్టీలు అనుకోవడం మరింత దారుణం. ఎన్నికల వ్యూహాలంటే కోట్ల రూపాయలు సమకూర్చుకోవడమే అన్నట్టుగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఈ లెక్కన 2019 ఎన్నికలు ఎంత ఖరీదు కాబోతున్నాయో, ఇంకెన్ని చిత్రాలు చూడాలో..! ఏళ్ల తరబడి చరిత్ర కలిగిన ఒక జాతీయ పార్టీలో నాయకుల సమర్థతకి సంపాదనే కొలమానం అన్నట్టుగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చర్చపై కాంగ్రెస్ స్పందిస్తుందా…?