ఏపీ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే! అయితే, అప్పట్నుంచీ చాలా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇతర శాఖల వ్యవహారాల్లో చినబాబు జోక్యం ఉంటోందనీ, ఇతర మంత్రుల పేషీల్లో స్టాఫ్ ని కూడా ఆయనే నియమిస్తారనీ.. ఇలా కొన్ని ఆరోపణలు ఈ మధ్య వింటున్నాం. తాజాగా వినిపిస్తున్న కథనం ఏంటంటే.. మంత్రి నారా లోకేష్ పేషీలో ఆయన ఓఎస్డీ వ్యవహార శైలిపై వినవస్తున్న గుసగుసలు! చినబాబు ఓఎస్డీగా గుత్తా కిరణ్ ను నియమించుకున్నారు. ఏపీకి సంబంధించిన ఐటీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. మంత్రిగా నారా లోకేష్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల వ్యవహారాలు చూసుకుంటారు కదా. దీన్లో ఐటీ వ్యవహారాలన్నీ ఓఎస్డీగా కిరణ్ అండర్ లో ఉంటాయట.
ఈయన జీతం కూడా మంత్రి లోకేష్ కంటే ఎక్కువ కావడం గమనార్హం! మంత్రిగా నారా లోకేష్ జీతం లక్షన్నర ఉంటే.. ఆయన ఓఎస్డీగా ఉన్న కిరణ్ కు మాత్రం రెండు లక్షలపైనే జీతమట! ఇంతకీ ఈ కిరణ్ ఎవరంటే… ఆ మధ్య చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా ఓ ఇష్యూ తెరమీదికి వచ్చింది కదా! అదేనండీ.. చంద్రబాబు అమెరికాలో పాల్గొనే సభకి టిక్కెట్లు అమ్మకం, ఎ.పి.ఎన్.ఆర్.టి. అధ్యక్షుడి వేమూరి రవి ప్రకటనపై విమర్శలు వచ్చాయి కదా. ఆయనకి సమీప బంధువే ఈ కిరణ్.
ప్రస్తుతం ఏపీలో ఐటీ విస్తరణ కోసం చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చిన్నచిన్న కంపెనీలకు చెందినవారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలుసుకునేందుకు వెళ్తుంటే.. అక్కడ ఈ కిరణ్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి, పార్టీ కోసం పనిచేస్తున్న ఐటీ విభాగానికి చెందినవారు కూడా లోకేష్ ను కలుసుకునేందుకు ఇబ్బందిగా మారుతోందట. దీంతో కిరణ్ తీరుపై విమర్శలు గుప్పుమంటున్నాయి. అయితే, ఇంతకీ కిరణ్ ను ఏరికోరి ఎందుకు పెట్టుకున్నారంటే… ఏపీకి కొత్త ఐటీ కంపెనీలను ఆకర్షించడం, ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, కొత్త ఐటీ సంస్థలు ఏర్పాటయ్యేలా చూడటం వంటివి ఆయన బాధ్యతలని చెబుతున్నారు.
అలాంటప్పుడు, ఆయన చాలా ఫ్రెండ్లీ అనే టాక్ బయటకి రావాలిగానీ… ఆయన వ్యవహార శైలి అదోలా ఉంటుందని విమర్శలు వస్తుండటమే గమనార్హం. ఇతర శాఖల పేషీల్లో లోకేష్ హవా నడుస్తుందని అంటారు. మరి, లోకేష్ పేషీలో ఇతడి హవా ఏంటో అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈయన ఒక్కరే కాదు… ఏపీ సర్కారు నియమించిన కొన్ని కొత్త నియామకాల పరిస్థితి ఇలానే ఉందని కూడా కామెంట్స్ ఉన్నాయి. మరి, ఇవన్నీ చంద్రబాబు వరకూ చేరుతున్నాయో లేదో..!