తెలుగుదేశం పార్టీ మీదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదా, మంత్రి నారా లోకేష్ మీదా సోషల్ మీడియాలో పంచ్ లూ, కౌంటర్లూ ఎక్కువైన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీటిపై చర్యలకు సర్కారు దిగడం కూడా చూస్తున్నాం. నారా లోకేష్ మంత్రి అయిన తరువాత, ఆయన మాట జారిన సందర్భాలూ వ్యాఖ్యానాలపై ఫోకస్ ఎక్కువైంది! అయితే, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా టీమ్ ను మరింత పటిష్ట పరచేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దాని కోసం ప్రత్యేకంగా కొంత బడ్జెట్ ను కూడా కేటాయించిందని తెలుస్తోంది.
నిజానికి, 2014 ఎన్నికల ముందు టీడీపీ సోషల్ మీడియా టీమ్ చాలా పటిష్టంగా ఉండేది. ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా ఒక ఐటీ వింగ్ పార్టీ కోసం అహర్నిశలూ పనిచేసింది. ముఖ్యమంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో వైకాపాపై సోషల్ మీడియా వార్ బాగానే సాగించారు. ఎన్నికల తరువాత సోషల్ మీడియాను టీడీపీ కాస్త లైట్ తీసుకుంది. ఈ మధ్య వైకాపాకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వీటన్నింటినీ ధీటుగా తట్టుకునేందుకు నెలకు రూ. 50 నుంచి 60 లక్షల వరకూ ఖర్చు చేసేందుకు టీడీపీ సిద్ధమైందని ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఆఫ్ ద రికార్డ్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ రేంజి బడ్జెట్ పెట్టడం ఇప్పుడు అవసరమా అనే చర్చ కూడా టీడీపీలో మరికొంతమంది నేతలు వినిపిస్తున్నారట! అధికార పక్షాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రభుత్వంలో వ్యతిరేకతను ఎత్తిచూపే అవకాశం వారికే ఎక్కువ కదా. ఇక, వైకాపాపై విమర్శలు చేయాలంటే టీడీపీ దగ్గరున్న కంటెంట్.. జగన్ అవినీతి, అక్రమాస్తులు! వీటిపై సోషల్ మీడియాలో వార్ మొదలుపెడితే ఆశించిన స్థాయిలో ప్రజలు కనెక్ట్ అవుతారా లేదా అనే అనుమానం పార్టీలోనే కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారట! ఎందుకంటే, జగన్ కేసులపై విమర్శలు అనేది రొటీన్ అయిపోయింది. విమర్శించేందుకు కొత్తగా అంటూ ఏమీ మిగల్లేదు. కాబట్టి, అదే పాత ప్రచారాన్ని మరోసారి సోషల్ మీడియాలోకి తెస్తే వర్కౌట్ అవుతుందా అనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోందట.
సో.. కంటెంట్ ఏదైనాసరే, టీడీపీ కూడా సోషల్ మీడియా వార్ కి సిద్ధమౌతోందన్నది దాదాపు కన్ఫర్మ్. ఈసారి కూడా ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఆధ్వర్యంలోనే మళ్లీ ఎటాక్ స్టార్ట్ కాబోతోంది. ఏదేమైనా, వచ్చే ఎన్నికల నాటికి సామాజిక మాధ్యమాల్లో మితిమీరిన ఆరోపణలూ, శృతి మించిన వ్యాఖ్యానాలూ, వాదోపవాదాలూ ఈ రచ్చ తారస్థాయిలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.