ప్రభుత్వంలో పెరుగుతున్న ప్రజా కంటకులు!
సిఎం గారూ!! బరువు దించుకోండి సారూ!!!
వార్తా వ్యాఖ్య
మొన్న… చీరాల ఎమ్మెల్లే ఆమంచి కృష్ణమోహన్ జర్నలిస్టుని నడిరోడ్డు మీద కొట్టారు
నిన్న…చింతలపూడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తాసిల్దార్ మీద దౌర్జన్యం చేశారు.
ఇవాళ…తణుకు ఎమ్మెల్ల్యే రాధాకృష్ణ పోలీసుల్ని నేల మీద కూర్చోబెట్టి కోప్పడ్డారు.
వీళ్ళు ముగ్గురూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే! ఇతర యంత్రాంగాల పట్ల గౌరవ మర్యాదలు లేకుండా, సొంతానికి సిగ్గూ బిడియాలు లేకుండా మనుషుల లాగ కాకుండా వారు జంతువులులా ప్రవర్తించడానికి మూలం వారి పార్టీ అధికారంలో వుండటమే!
ఎమ్మెల్యేల వ్యవహారశైలి నాకు చెడ్డపేరు తెస్తున్నది అని చంద్రబాబుగారు చెప్పే మాటలు ఆయనకు సానుభూతిని పెంచవు. ఈ మెతకతనం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. అందరితోనూ మంచి అనిపించుకోవాలనే తీరని కోరికను చంద్రబాబు పక్కనపెట్టేయ్యాలి. దుష్టశిక్షణకు కరకుతనం తెచ్చుకోవాలి. ఇదంతా ఆయనకు తెలిసి జరగకపోయినా కూడా దుండగులపై చర్యలు తీసుకోకపోతే ప్రజలకే కాక, ఆయన సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు, నాయకులకు కూడా అధినాయకుడు చేతగానివాడన్న సంకేతాలు అందుతాయి.
మరో వైపు విజయవాడలో కాల్ మనీ, హవాలా చిత్రహింసలు…ఇందులో దుండగులు, గూండాలు బెయిలు మీద బయటపడి ప్రభుత్వం మాదేనని జంకూగొంకూ లేకుండా బోరవిరుచుకు తిరుగుతున్నారు. వారి మాటలు నిజం కాకపోవచ్చు. అయితే వారిని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే! కాల్ మనీ కేసులో కఠినంగా వ్యవహరించినా ఏమీ చేయలేక పోయన పోలీసు ఉన్నతాధికారి గౌతమ్ సవాంగ్, ఇపుడు తణుకు విషయంలో అదంతా ట్రాష్ అనేశారంటే ఆయన తలబొప్పులను అర్ధం చేసుకోవచ్చు..
చట్టాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వంలోని భాగస్వాములే చట్టాన్ని ఏమాత్రం సిగ్గూలేకుండా చేతుల్లోకి తీసేసుకుంటున్నప్పుడు చూస్తూ ఊరుకుండిపోయిన ఏ అధినేతకైనా ప్రజల్లో గౌరవ, మర్యాదలు పలచబడిపోతాయి.
ముఖ్యమంత్రి గారూ! మీ భుజాలెక్కి స్వారీ చేస్తున్న ప్రజా కంటకుల బరువు ఎలాగైనా దించేసుకోండి సర్! ప్లీజ్