ఎపి తెలంగాణల మధ్య విభజన సమస్యల పరిష్కారం గనక అనుకున్న స్పూర్తితో జరగకపోతే దేశ రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చని విభజన చట్టంలో పొందుపర్చిన 108వ సెక్షన్ చెబుతున్నది. అయితే ఈ జోక్యానికి మూడేళ్ల గడువు పెట్టింది.జూన్2 అంటే తెలంగాణ అవతరణ దినోత్సవంతో ఆ మూడేళ్ల గడువు పూర్తవుతుంది. మరి ఆస్తుల నిధుల విభజన ఏ మేరకైనా పూర్తయిందా అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. గడువు పూర్తవుతుంది గనక త్వరపడాలని గాని లేక గడువు పెంచుకోవాలని గాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకపోవడం దారుణం. దీనిపై చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మగ్దుం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాంగ్రెస్ వైసీపీ లోక్సత్తా వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. విభజన తర్వాత సహజంగా ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కేంద్రం ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడం, టిడిపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా రాజకీయ అవసరాల మేరకు తప్ప రాజ్యాంగ నిబంధనల ప్రకారం వ్యవహరించకపోవడం సమస్యలను పేరబెడుతూ అప్పుడప్పుడూ వేడి పెంచడం అంతా వ్యూహాత్మకంగానే జరుగుతున్నది. ఉమ్మడి గవర్నర్గాకొనసాగుతున్న వారు కూడా ఈ విషయంలో బాధ్యత తీసుకోవలసి వుంటుంది. విభజన అనేది రాజ్యాంగ సమస్య అయితే దానిలో రాజకీయాలు జొప్పించడం పాలకుల సంకుచితత్వానికి పరాకాష్ఠ.
భౌగోళికంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఎపి జిల్లాలకు ఎగువన వుంది. కనుకనే ప్రభుత్వ సంస్థలు ఆస్తిపాస్తులు ఇక్కడ ఎన్నో ఏర్పడ్డాయి అన్ని ప్రాంతాల ప్రజలూ తరలివచ్చారు.నదీ జలాలు కూడా ఎగువనుంచి దిగువకు సూత్రం ప్రకారం తెలంగాణ నుంచి ఎపికి వెళ్లాల్సిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే విభజన ప్రభావం ఎపికి ఎక్కువగా వుండటం సహజం. ఈ రీత్యా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజన చట్టం అమలు కోసం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టాల్సింది. కాని రాజధాని అమరావతి గురించిన ఆర్బాటం తప్ప విభజన పూర్తి చేసుకోవడంపై ఎడతెగని నిర్లక్ష్యం కానవచ్చింది. ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు బెదిరింపు ధోరణిలో మాట్లాడిన వారు హఠాత్తుగా మకాం ఎత్తివేయడంతో టిడిపి ప్రభుత్వానికి నైతిక బలం కూడా తగ్గిపోయింది.ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రత్యేక హౌదాకు ఎగనామం పెట్టడమే గాక సమస్యల పరిష్కారానికి సహకరించి నిర్నీథ వ్యవధిలో పరిష్కరించడానికి చొరవ చూపలేదు. పైగా ఇద్దరూ కీచులాడుకుంటే తనకే మంచిదన్న ధోరణి బిజెపిలో వుండిపోయింది. తెలుగుదేశం దానితో భాగస్వామి గనక అక్కడా ఒత్తిడి తేలేకపోయింది.ఇటీవల వైసీపీ కూడా మోడీ మద్దతుదారుగా మారింది. టిఆర్ఎస్కు ఈ విషయంలో పెద్ద హడావుడి వుండదు. భవనాలు ఇక్కడే వుండిపోతాయి గనక చేయగలిగిందీ వుండదు.కనీసం నగదు, పత్రాలు, వంటివైనా సజావుగా చర్చించింది లేదు. నదీజలాలపై హఠాత్తుగా ఇరు పక్షాలు వేడిపెంచడం తర్వాత గప్చిప్. ఇటీవల ఢిల్లీలోని ఎపి భవన్లోనూ కయ్యం జరిగింది. చూస్తుంటే ఇదంతా వ్యూహాత్మక రాజకీయంగా కనిపిస్తుంది. మూడు పాలక పార్టీలూ విభజన సమస్యలను వచ్చే ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నాయి.అయినా సరే వారిపై ఒత్తిడి తెచ్చి పరిష్కారాలు జరిగేలా చూడాలి. కనీసం విభజన ఒప్పందాలకు గడువైపా పెంచాలి.రాష్ట్రపతి జోక్యానికి గడువు ముగిసిపోతే ఇక ప్రతిదానికీ కోర్టులను ఆశ్రయించవలసిందే. ఆ అవసరం లేకుండా వెంకయ్య నాయుడు వంటి వారు కనీస చొరవ చూపిస్తారా?