ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖామాత్యులు కె.యి. కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది! చంద్రబాబు సర్కారులో తన ప్రాధాన్యత రోజు రోజుకీ తగ్గిపోతూ ఉండటంపై ఆయన ఆవేదనతో ఉంటున్నారట. ప్రతీ దశలోనూ తనకు అవమానాలు ఎదురౌతున్నాయనీ, క్యాబినెట్ లో అత్యంత సీనియర్ నాయకుడిని అయినా కూడా ఉద్దేశపూర్వకంగానే తనను పక్క పెట్టేస్తున్నారంటూ సన్నిహితులతో ఆయన చెప్పినట్టు సమాచారం! ఇటీవల కాలంలో తనకు పరాభవాలు ఎక్కువౌతున్నాయనీ, ఇలా అయితే తాను ప్రజల్లోకి ఎలా వెళ్లగలనని అంటున్నారట!
నిన్నమొన్నటి వరకూ కేఈ దగ్గర ఆర్డీవోల బదిలీ అధికారం ఉండేది. ఈ మధ్యనే దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంజేసుకున్నారు! ఇక, గడచిన నెలలో ప్రభుత్వం భూకేటాయింపుల కమిటీ వేసిన సంగతి తెలిసిందే. దాన్లో కేఈకి స్థానం కల్పించలేదు. రాష్ట్ర రెవెన్యూ మంత్రికి భూకేటాయింపుల కమిటీలో స్థానంలో లేకుండా చేసి, క్యాబినెట్ లో అత్యంత జూనియర్ అయిన నారా లోకేష్ కు భాగస్వామ్యం కల్పించడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. చాలా విమర్శలు వినిపించాయి. సీనియర్లుకు ఆ కమిటీలో స్థానం కల్పించాలని రూలు లేదు కదా అంటూ కొంతమంది తెలుగుదేశం నేతలు వెనకేసుకొచ్చినా… ఈ నిర్ణయం కేఈకి మరింత అసంతృప్తి కలిగించింది అనడంలో సందేహం లేదు.
ఇంతకుముందు రాజధాని భూముల సేకరణ విషయంలోనూ ఇలానే జరిగింది. భూసంబంధ వ్యవహారాలన్నీ రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తాయి. అయినా సరే, రాజధాని భూ సేకరణ పనులను కేఈని కాదని, మంత్రి నారాయణకు చంద్రబాబు అప్పగించారు. పోనీ.. ఈ మధ్యనే జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రుల నియామకం జరిగింది. ఇక్కడ కూడా కేఈకి చోటు దక్కలేదు. మరో డిప్యూటీ సీఎంగా ఉన్న నిమ్మకాయల చినరాజప్పకు విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించారు. కానీ, కేఈని పక్కన పెట్టేశారు.
సరే.. ఇవేవీ లేవు, ఉన్న శాఖలో అయినా ఆయనకు గుర్తింపు ఉందా అంటే అదీ అంతంత మాత్రమే అని ఆయనే వాపోతున్నారట! పేరుకు రెవెన్యూ శాఖ మంత్రి అని చెప్పుకుంటున్నా… వ్యవహారాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చూసుకుంటారనీ, నిర్ణయాలన్నీ అయిపోయాక చివర్లో తనకు సమాచారం ఇస్తారని కూడా కేఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో చంద్రబాబు సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుబడుతూ అక్కడక్కడా వ్యాఖ్యానిస్తున్నారట. ఈ విషయం తెలిస్తే చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతారో! అసలే అత్యంత క్రమశిక్ణణ కలిగి రాజకీయ పార్టీ కదా!