కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగుదేశం పార్టీకి షాకిచ్చారు. పార్టీలోని జగన్మోహన్ రెడ్డి విమర్శకుల్ని నివ్వెరపోయేలా చేశారు. తాను పాదరసంలాంటి వాడినని నిరూపించుకున్నారు. ప్రభువు మనసెరిగి నడిచే భటుణ్ణని రూఢీ పరచుకున్నారు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అనే నానుడిని వంటపట్టించుకున్నానని మరోసారి చాటుకున్నారు. ఆ…ఆ… ఆగండి.. నన్ను విమర్శించేయకండి.. వెంకయ్యనాయుడు గారేమిటి.. చంద్రబాబు నాయుడు టీడీపీకి షాకివ్వడమేమిటి అనుకుంటున్నారుగా.
కనీస రాజకీయ పరిజ్ఞానమున్నవారెవరూ నరేంద్రమోడీతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీని తప్పు పట్టరు…. అంటూ శనివారం నోరువిప్పి చేసిన వ్యాఖ్యానం టీడీపీలో కల్లోలాన్నే సృష్టించింది. ప్రధానికి జగన్ వినతి పత్రం ఇచ్చి రావడాన్ని తప్పెందుకు పడుతున్నారంటూ ప్రశ్నించారు. కనీస రాజకీయ పరిజ్ఞానం అనే పదాలను తన శైలిలో నొక్కి పలికి తన ఆంతర్యాన్ని తెలియజెప్పారు. ప్రధాని-జగన్ భేటీపై మిత్రులిద్దరి వ్యాఖ్యలూ, వ్యాఖ్యానాలు ఒకెత్తు.. వెంకయ్య నోటివెంట వెలువడిన పలుకులు ఒకెత్తు. ఎందుకంటే.. రాష్ట్రంలో బీజేపీకి ఆయన మాటలే ఫైనల్. ఫైసల్ కూడానూ. బహుశా ఇలాంటి మాట వెంకయ్య నుంచి వినాల్సి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. యలమంచిలి వెంకట బాబూ రాజేంద్రప్రసాద్ వంటి కరడుగట్టిన భక్తులకు కూడా చంద్రబాబు క్లాస్ తీసుకోవడం.. వెంకయ్య పదావళి ఒకేరోజున సంభవించడం వెనుక ఏదైనా పరమార్థముందో చెప్పలేం గానీ, ఇరుకున పడిన సంబంధాలను గాడిన పెట్టాలని చంద్రబాబు తపన పడుతున్నారని మాత్రం తెలుస్తోంది. ఆయన అవసరం అలాంటిది మరి. వెంకయ్య వ్యాఖ్యలు భవిష్యత్తును టీడీపీ శ్రేణులకు వెండితెరపై చూపించేశాయి. అలా అవ్వచ్చు.. కాకపోవచ్చు.. కానీ మొత్తానికి రెండు పార్టీల నడుమ ఏదో జరిగిపోతోందని మాత్రం లోకానికి తెలిసిపోతోంది. ఒక్క విషయం మాత్రం నిజం. వెంకయ్యకు వాస్తవం తెలిసొచ్చింది. ఇప్పటిప వరకూ టీడీపీ పట్ల అనుసరించిన వైఖరి ఇకపై సాగదని అవగతమైందనుకోవచ్చా!!
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి