గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సబ్ ఇన్‌స్పెక్టర్ నుంచి ఐపిఎస్ వరకూ అందరినీ కలిపి సమావేశం జరిపి పొగడ్తలు కురిపించారు. ఇలా కిందిస్తాయి వారిని కూడా కలుసుకోవడం ప్రజాస్వామికంగా కనిపించినా వికేంద్రీకరణకు విరుద్ధమైన ఏకవ్యక్తి పాలన లక్షణాలు దీనిలో వున్నాయని అందరూ గమనించారు. వచ్చే ఎన్నికల కోసం పోలీసులను మంచి చేసుకోవడానికి కెసిఆర్ ధైర్యంగా ప్రయత్నం చేశారని హిందూ వ్యాఖ్యానించింది. అంతకన్నా ముఖ్యమైన కారణాలు కూడా వున్నాయి. ఇటీవల ఖమ్మం మార్కెట్ యార్డు దాడి ఘటనలో నిందితులుగా వున్న రైతులకు చేతులకు బేడీలు వేసి కోర్టుకు హాజరుపర్చడం తీవ్ర విమర్శకు దారితీసింది.దాంతో తమకు సంబంధం లేదనీ, పోలీసులే కారణమని ప్రకటించిన ప్రభుత్వం చర్య తీసుకుంది. తర్వాత ధర్నాచౌక్ ఎత్తివేత కోసం స్తానికుల ముసుగులో నిరసన చేసింది మఫ్తీ పోలీసులేనని తేలింది. ఈ ఘటనలోనూ శ్రీదేవి అనే సిఐని మరికొందరు పోలీసులను ప్రభుత్వం పక్కనపెట్టింది. ఇక నయీం కేసులో ప్రత్యక్షంగా దొరికిపోయిన కొందరు అధికారులపై వేటు వేసింది.ఇన్ని చర్యల తర్వాత పోలీసులలో ప్రభుత్వంపైన విముఖత కలిగిందన్న సంకోచంతోనే కెసిఆర్ అందరినీ పిలిపించి అభినందించారనే అభిప్రాయం వుంది.పోలీసులు పని అంత బాగుంటే ఇలాటి ఘటనలు ఎందుకు జరిగాయనే ప్రశ్న కూడా ఎదురవుతున్నది.
ఇదేగాక ఈ కాలంలో పై అధికారుల నిరంశుశ పోకడలు అవినీతి చర్యలపై దిగువ స్థాయి ఇన్‌స్పెక్టర్లు, పోలీసులు ఫిర్యాదులు చేయడం ప్రాణాలు తీసుకోవడం పెరిగింది. వీటిపై సమగ్రంగా సమీక్ష జరిపి ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధపడలేదు.మౌలికంగా ఆయన పోలీసులకు స్వేచ్చ పేరిట ప్రతిపక్షాలపైన ప్రత్యర్తులపైన కఠినంగా ఉపయోగించాలని కోరుకుంటారు. మావోయిస్టులపై ప్రత్యేకంగా దాడులు వైఎస్ హయాంలో మొదలై తర్వాత కొనసాగాయి. కెసిఆర్ వచ్చాక ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే వారిని నిర్యూలించడంలో తమ పోలీసులు దేశంలోనే ముందున్నారని ఆయన భావన ఈ సమావేశంలో వెలిబుచ్చారు. మరైతే ఈ లోపాలకు ఎవరు బాధ్యులనే ప్రశ్న వచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డిజిపి అనురాగ్‌శర్మను, హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డిని మాత్రమే పదే పదే ప్రస్తావించడంతో ఇతర ఐపిఎస్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో మా పాత్రను పట్టించుకోరా అనే రీతిలో వ్యాఖ్యానించారు. కరీం నగర్ కమిషనరేట్ తప్ప తక్కినవి బాగాలేవనే రీతిలో ఆయన మాట్లాడ్డం కూడా మిగిలిన వారికి మింగుడు పడలేదు. ఈ విధంగా కెసిఆర్ పోలీసు వ్యూహం మూడు రకాలుగా విమర్శలు కొనితెచ్చుకుంది. అదేపనిగా పోలీసులను పొగడ్డం వారిని సానుకూలం చేసుకోవాలనే దృష్టిని తప్ప ప్రజాస్వామిక స్పూర్తిని చూపించడం లేదు. దిగువ స్తాయిలో తీవ్ర సమస్యలు అస్తిత్వ సవాలు ఎదుర్కొంటున్న పోలీసుల జూనియర్ అధికారుల వేదనను ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఐపిఎస్‌లలో కూడా ఇద్దరినే అతిగా పొగడ్డం బాలేదు.