అక్షరాభ్యాసం చేయించినప్పుడు చిన్న పిల్లలతో ఓం నమఃశివాయ అని రాయిస్తారు. దీనికి కారణం శివపంచాక్షరిని మొదట రాయిస్తే సర్వం శుభకరమని భావించడం. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కొత్త సంప్రదాయాన్ని సృష్టించారు. తన మనవడు దేవాంశ్ అక్షరాభ్యాసాన్ని వైభవోపేతంగా నిర్వహింపజేసిన ఆయన ఆ తదుపరి ఈ అంశాన్ని వెల్లడించారు. తన మనుమడితో అమ్మ, అమరావతి, ఆదాయం, ఆరోగ్యం, ఆనందం అనే పదాలను రాయింపజేశారు ముఖ్యమంత్రి. ఆ రకంగా అమరావతిపట్ల తనకెంత అనురక్తి ఉన్నదీ చాటుకున్నారు. మనుమడి అన్నప్రాశన కూడా తిరుమలలోనే నిర్వహించాననీ, కొత్త పదాలు రాయించి, సరికొత్త సంప్రదాయాన్ని సృష్టింపజేశాననీ తెలిపారు. మనుమడంటే ఎవరికి అనురక్తి ఉండదు చెప్పండి. అ అంటే అమ్మ అని రాయించారు ఓకే. ఆ అంటే ఆవు అని కదా రాయించాలి. ఆదాయం, ఆరోగ్యం, ఆనందమంటే ఎంతో ఇష్టమున్నా ఆవును ఎందుకు విస్మరించారు. ఆవు పాలతో ఆయన రాయించిన మూడు పదాల లాభాలను పొందారు కాబట్టి, రాయనవసరం లేదనుకున్నారా! ఎంతైనా చంద్రబాబు తాను చెప్పదలచుకున్నది చాలా చాకచక్యంగా చెప్పగలనని నిరూపించుకున్నారు. దేవాంశ్ అక్షరాభ్యాసం సందర్భంగా ఆయన ఎంతో మురిసిపోయారు. మనవణ్ణి చంక దింపలేదంటే నమ్మండి.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి