హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ మంచి పాయింట్ లేవదీశారు. అసలు చైనా పరిస్థితే దారుణంగా ఉండి, మార్కెట్లన్నీ కుప్పకూలిపోయి ఉంటే కేసీఆర్ అక్కడనుంచి పెట్టుబడులు ఏమి తెస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చైనాకు రానూ, పోనూ మాట్లాడుకుని తీసుకెళ్ళిన విమానానికి రెండున్నర కోట్లు ఖర్చవుతోందని, ఒకవైపు రైతులు కష్టాలతో సహజీవనం చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ముఖ్యమంత్రికి చైనా పర్యటన కావాల్సివచ్చిందా అని పొన్నం అన్నారు. ఆయన చైనా పర్యటన తీరు రాచరికాన్ని గుర్తుచేస్తోందని విమర్శించారు.
పొన్నం వాదనలో కొంతవరకు నిజముంది. చైనా ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. అందుకోసమే తమ కరెన్సీని చైనా 30% డీవేల్యూ చేసింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవటంకోసం తమ ఉత్పత్తుల రేట్లుకూడా తగ్గించబోతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు కేసీఆర్, ఆయన బృందం ఇవాళ చైనాలోని డేలియన్ నగరంలో భారత రాయబారి అశోక్ కాంతాతో సమావేశమయింది. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంపై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ కేశవరావు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు జూపల్లి, జగదీష్ రెడ్డి, ఎంపీ వేణుగోపాలాచారి, కొప్పుల ఈశ్వర్, గువ్వల బాలరాజు, అధికారులు ఉన్నారు.