చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ తీసుకున్న ఒక నిర్ణయం విమర్శలకు గురయ్యేలా ఉంది. దళిత నిరుద్యోగులకు 20లక్షలు విలువ చేసే 125 ఇన్నోవా కార్లను తన చేతులమీదుగా పంపిణీ చేశారు చంద్రబాబు. ఆ ఇన్నోవాలపైన చంద్రబాబు బొమ్మను కూడా ముద్రించారు. అయితే ఇన్నోవాలను తీసుకున్న కొంతమంది ఇప్పుడు చంద్రబాబు బొమ్మను తొలగించేశారు. ఆ విషయం తెలుసుకున్న చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు బొమ్మను తొలగించిన ఎనిమిది ఇన్నోవాలను దళిత యువకుల నుంచి స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఇదే విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ మీడియా ముఖంగా ప్రజలకు వివరించారు. చంద్రబాబుకు కృతజ్ఙులై ఉండాల్సిందేనని, చంద్రబాబు బొమ్మ తీసేస్తే ఒఫ్పుకునేది లేదని హెచ్చరించారు.
ఇదే సందర్భంలో ఇలాంటి పబ్లిసిటీ కార్యక్రమాల విషయంలో చాలా గొప్పగా ఆలోచించిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గురించి చెప్పుకోవాలి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తానతో పాటు, తన తండ్రి బొమ్మలు కూడా ఉన్న స్కూల్ బ్యాగులను విద్యార్థులకు పంపిణీ చేయడానికి రెడీ చేశాడు. అంతలోనే ప్రభుత్వం మారిపోయింది. కోట్లాది రూపాయల విలువైన ఆ స్కూల్ పిల్లల బ్యాగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అధికారులకు అంతుపట్టలేదు. అయితే యోగీ మాత్రం ములాయం, అఖిలేష్ బొమ్మలు ముద్రించి ఉన్న, సమాజ్ వాదీ పార్టీకి ప్రచారం కల్పించేలా ఉన్న ఆ స్కూల్ బ్యాగులను స్వయంగా తన చేతుల మీదుగానే విద్యార్థులకు పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నాడు.
ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ చేయడం, ఇన్నోవాలను స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని అభిప్రాయపడుతున్నారు.