ఏ గుమ్మం దగ్గర ఆ పాట పాడాలని ఓ పాత సామెత. దీన్ని బాగా ఆకళింపుజేసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే! భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయమై రాష్ట్రానికో పాట పాడుతోంది. ఆంధ్రాలో భాజపాతో పొత్తు గురించి విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గడచిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే విజయవాడలో తెలుగుదేశం మరింత మెజారిటీ సాధించేదని నాని అన్నారు. 2019 ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉన్నా లేకున్నా, విజయవాడలో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సో.. ఆంధ్రాలో పొత్తుపై టీడీపీ అభిప్రాయం.
గడచిన వారంలోనే.. తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్. రమణ తదితరులు చంద్రబాబును కలుసుకున్నారు. ఆ సందర్భంగా వారి మధ్య వచ్చిన చర్చ ఏంటంటే.. తెలంగాణలో భాజపాతో తెగతెంపులు చేసుకుందామనీ! భాజపాతో పొత్తు విషయమై ఏదో ఒకటి తేల్చుకోవాలని, మహానాడు సందర్భంగా దీని గురించి ఏదో ఒక తీర్మానం చేయాలన్నట్టుగా చంద్రబాబుపై వారు ఒత్తిడి తీసుకొచ్చారట. అయితే, వారికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఏంటటా… తొందరపడొద్దని! తెలంగాణలో భాజపాతో పొత్తు విషయమై తాను అమిత్ షాతో మాట్లాడతాననీ, అంతవరకూ ఎవ్వరూ ఎలాంటి కామెంట్లు చెయ్యొద్దంటూ రేవంత్ తదితరులకు చంద్రబాబు ఉద్భోదించినట్టు కథనాలు వచ్చాయి. మరి, ఆంధ్రా నేతలు భాజపా పొత్తుపై కామెంట్లు చేస్తున్నారే! ఏమని అర్థం చేసుకోవాలి?
నిజానికి, తెలుగుదేశంతో పొత్తు విషయమై భాజపా నేతలు అంత సముఖంగా ఈ మధ్య ఉండటం లేదు! తెలంగాణలో టీడీపీ నేతల్ని భాజపా ఎప్పుడో దూరం పెట్టేసింది. ఇక, ఆంధ్రాలో భాజపా నేతలే తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. రాష్ట్రాలను కాషాయీకరణ చేసేందుకు భాజపా కంకణబద్ధమై ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రాల్లో కూడా పట్టు బిగించేందుకు సిద్ధమౌతోంది. అందుకే, టీడీపీతో పొత్తు గురించి ఈ మధ్య భాజపా నేతలు తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రంలోనే అన్నట్టుగా తెలుగుదేశం వ్యవహరిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం బాగా వీక్ గా ఉంది కాబట్టి, అక్కడ భాజపాతో పొత్తు అవసరం అనే సంకేతాలు ఇస్తున్నారు. ఆంధ్రాలో ఆ అవసరం ప్రస్తుతానికి లేదు కాబట్టి.. పొత్తు పెట్టుకోకుండా ఉన్నట్టయితే ఇంకా మెజారిటీ వచ్చేదని నాని లాంటివాళ్లు ఇప్పుడు తీరిగ్గా అంటున్నారు. ఇప్పుడు నాని మాటల్లోని ధీమా 2014లో ఏమైంది..? సరే, ఏపీ విషయంలో ఇదే ధీమా, అంటే భాజపా అవసరం లేదన్న ధీమా 2019లో కూడా ఉంటుందా..?