యేడాదికి నాలుగైదు సినిమాలు.. అందులో రెండు మూడు హిట్లు.. తీరిక లేని షెడ్యూల్.. ఇదీ రకుల్ కెరీర్!
జెట్ స్పీడ్ అంటారే… రకుల్ ఆ వేగంతోనే దూసుకెళ్లిపోతోంది. ఇప్పటికే స్టార్ హీరోలందరితోనూ ఓ రౌండ్‌కొట్టేసింది. తొలిసారి నాగచైతన్య, మహేష్ బాబులతో కలసి పనిచేస్తోంది. చైతూతో కలసి నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఈనెల 26న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ తో చేసిన చిట్ చాట్ ఇది…!
హాయ్ రకుల్…
హాయ్…
భ్రమరాంబ పాత్ర ఈ సినిమాలో అదిరిపోతుంది అని అందరూ ఊరించేస్తున్నారు.. నిజంగా అంత బాగుంటుందా?
నిజంగా నిజం. ఇదేం మాట వరుసకు చెబుతున్న మాట కాదు. నా కెరీర్‌లో ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. బహుశా.. మళ్లీ ఇలాంటి పాత్ర నా కోసం రాస్తారో లేదో కూడా నాకు తెలీదు. దర్శకుడు కల్యాణ్ కృష్ణ.. ఈ కథ చెప్పగానే `భ్రమరాంబ పాత్ర నేను చేస్తున్నా.. ఇంకెవ్వరికీ ఇవ్వొద్దు` అని రిక్వెస్ట్ చేశా. నిజానికి ఆ సమయంలో నా దగ్గర ఈ సినిమాకి ఇవ్వడానికి డేట్లు కూడా లేవు. ఏదోలా ఎడ్జస్ట్ చేద్దామనుకొన్నా. కానీ.. నా కోసం చిత్రబృందం నాలుగు నెలలు ఓపిక పట్టి మరీ ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ విషయంలో నాకంటే అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు.
అంత గొప్పగా భ్రమరాంబ పాత్ర లో ఏం నచ్చింది?
ఆ పాత్ర తెరకెక్కించిన తీరే.. డిఫరెంట్ గా ఉంటుంది. మాట తీరు, కట్టూ బొట్టూ, పాత్ర తాలుకూ వ్యక్తిత్వం ఇవన్నీ కట్టిపడేస్తాయి. భ్రమరాంబ పాత్రలోంచి బయటపడడానికి నాకు చాలా కాలం పట్టేట్టు ఉంది. నిజానికి ఇప్పటికీ నన్ను నేను భ్రమరాంబగానే ఊహించుకొంటున్నా.
చైతూతో కలసి నటించడం ఇదే తొలిసారి కదా?
అవును. అయితే… చైతూతో నాకెప్పటినుంచీ మంచి స్నేహం ఉంది. మేం కలసి పనిచేయకపోయినా..ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. సెట్లో చాలా హుందాగా ఉంటాడు. తోటి నటీనటులకు మర్యాద ఇస్తాడు. సెట్లో ఎలా ఉండాలో… మిగిలినవాళ్లందరికీ చైతూతో కోచింగ్ ఇప్పించాలి. అంత మంచి కోస్టార్.
ఈ సినిమా చూసి నాగార్జున ఏమన్నారు?
డోలు బాగా వాయించావు.. ఎక్కడ నేర్చుకొన్నావు ? అని అడిగారు. (నవ్వుతూ). నిజంగానే నేనెప్పుడూ డోలు వాయించలేదు. ఇదే తొలిసారి. భ్రమరాంబ పాత్రలో లీనమైపోయినందువల్ల అలా.. అనిపించిందేమో..? నాగ్ సార్‌కి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నా పాత్ర కూడా.
అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో.. మరి అబ్బాయిలు..?
అబ్బాయిలు విషపూరితం అనే డైలాగ్ నాచేత చెప్పించారు దర్శకుడు. హానికరం అంటే.. కొంచెం కొంచెంగా ఆరోగ్యం పాడవుతుంది. విషపూరితం అంటే ఇంకా ప్రమాదం కదా? అలా నా డైలాగ్‌తో కౌంటర్ కూడా వేసేశారు.
ఇంత బలమైన కథానాయిక పాత్ర పోషించారు కదా. మరి మిగిలిన సినిమాల్లో కథానాయికల పాత్రలకు అంత ప్రాధాన్యం ఎందుకు ఉండడం లేదో ప్రశ్నించుకొన్నారా?
భ్రమరాంబ లాంటి పాత్రలు ఎప్పుడో గానీ పుట్టవు. అలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. యేడాదికి రెండు మూడు సినిమాలొస్తాయేమో. ఇలాంటి పాత్రలే చేయాలి అనుకొంటే.. మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉండాల్సిందే. నాకు కమర్షియల్ సినిమాల్లో నటించడంలోనూ ఓ ఆనందం ఉంటుంది. దాన్ని నేను పూర్తిగా అనుభవిస్తున్నా కూడా.
యంగ్ హీరోలు, సీనియర్లతో కలసి నటిస్తున్నారు. ఇద్దరిలో ఎలాంటి వ్యత్యాసం కనిపిస్తోంది?
ఎవరికి వాళ్లే. చైతూ లాంటి హీరోతో అయితే… ఓ ఫ్రెండ్‌లా అనుకొని నటించేయొచ్చు. ఆ ఫ్రీడమ్ ఉంటుంది. పెద్ద హీరోల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే… నేను పనిచేసిన ప్రతీ హీరో నాకు కావల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. సెట్లో ఓ స్నేహితురాలిగా చూసుకొన్నారు.
నిర్మాతగా మారే ఆలోచనలున్నాయని చెబుతున్నారు..
ఓ దశలో అనుకొన్నా. కానీ.. ఆ ప్రయత్నం విరమించుకొన్నా. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినదాన్ని. డబ్బుల్ని ధారాళంగా ఖర్చు పెట్టడం నా మనసుకి నచ్చదు.
మహేష్ సినిమా సంగతులేంటి?
మురుగదాస్ – మహేష్ అంటేనే ఓ అద్భుతమైన కాంబినేషన్. ఇలాంటి సినిమాలో అవకాశం దక్కడం నా అదృష్టం. ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పకూడదు. స్పైడర్ గురించి మాట్లాడుకోవడానికి ఇంకా టైమ్ ఉంది.
మధ్య సచిన్‌ని కలిశారు.. ఇంటర్వ్యూ చేశారు… ఎలా ఉంది ఆ అనుభవం?
జీవితంలో సచిన్‌ని ఒక్కసారైనా కలుస్తానా? అనుకొన్నా. అలాంటి వ్యక్తిని కలవడమే కాదు, మాట్లాడా.. మాట్లాడించా. ఇంతకంటే ఏం కావాలి? నా జీవితంలో మర్చిపోలేని రోజు అది.