చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగులను రాచిరంపాన పెడతారు అనే విమర్శ ఎప్పట్నుంచో వింటున్నదే. ఆయన సీఎం అయితే అధికారాలను నిద్రపోనివ్వరు అని అంటుంటారు! గడచిన ఎన్నికల ముందు ఉద్యోగులకు కూడా చంద్రబాబు ఓ హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులను ఎలాంటి ఇబ్బందులూ ఉండవని! సరే, అది గతం. అధికారంలోకి వచ్చాక, ఉద్యోగుల విషయంలో పాత చంద్రబాబే మళ్లీ నిద్రలేచారు అంటూ విమర్శలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. సమీక్షలూ సమావేశాలంటూ గంటల తరబడి కూర్చోబెట్టేస్తారూ, చెప్పిందే చెబుతూ టైం పాస్ చేసేస్తారంటూ ఈ మధ్య కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే… ప్రమోషన్ మీద ఆంధ్రాకి వెళ్లమన్నా కూడా కొంతమంది జూనియర్ అధికారులు వద్దు వద్దు అంటున్నారట!
జిల్లాకు కలెక్టర్ గా వెళ్లడం అంటే ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు ఎగిరిగంతేస్తారు. ఎందుకంటే, వారు సివిల్స్ రాసిందే ఆ కలను నిజం చేసుకోవడానికి. ఒక జిల్లాకు కలెక్టర్ గా వెళ్తే ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. సొంత ఆలోచనల్ని ఆచరణలో పెట్టే ఆస్కారం ఉంటుంది. సో.. ఆ అవకాశం కోసం లాబీయింగ్ చేసేవారూ కొంతమంది ఉంటారు. కానీ, దానికి భిన్నంగా… కొంతమంది జూనియర్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు లాబీయింగ్ చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని పోస్టింగుల్లో తమకు జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వొద్దంటూ కొందరు వాపోయారట! ఆంధ్రాలో జిల్లా కలెక్టరు పోస్టు తమకొద్దంటూ చెప్పడం ఆశ్చర్యకరం. ఏపీ వెళ్లేందుకు ఎందుకు ఇంత అయిష్టతతో ఉన్నారనే అంశమై ఓ ఉన్నతాధికారి ఆరా తీశారట. దీంలో వారి మనసులోని మాట.. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి రెండూ బయటపడ్డట్టయింది.
ఆంధ్రాకు వెళ్తే సొంత ఆలోచల్ని అమలు చేసే అవకాశం ఉండదని కొంతమంది జూనియర్ అధికారులు చెప్పారట. ఎంతసేపూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల గురించీ, వాటి ఏర్పాటు గురించీ, సభలకు స్థలాలు ఎంపిక, వీవీఐపీలకు మర్యాదలు, కీలక నేతల సౌకర్యాల ఏర్పాట్లు… వీటితోనే సమయం సరిపోతుందన్నారట. సాధారణ పాలనా వ్యవహారాలు చూసుకునేంత సమయం తమకు లేకుండా చేసేస్తారని అభిప్రాయపడ్డారట. ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్నవారి తీరును గమనిస్తుంటే ఆ విషయం అర్థమౌతుందని, అందుకే కలెక్టర్ గా అవకాశం వచ్చినా కూడా ఆంధ్రాకు వెళ్లేందుకు తాము అయిష్టంగా ఉన్నట్టు వారు వాపోయారట.
సో.. వాస్తవ పరిస్థితి ఇదన్నమాట. జిల్లాలో పాలన వ్యవహారాలు చూసుకునేందుకు కూడా తమకు సమయం ఉండదని అధికారులు ముందే భయపడిపోతున్నారు! ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. సాధారణ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి ఎన్ని పనులు చెప్పినా అధికారులు చేస్తారు. ఎంత సమయమైనా చేస్తారు. దాన్ని పని ఒత్తిడిగా భావించరు. అది వాళ్ల విధి. కానీ, అందుకు భిన్నంగా వీరి విధి నిర్వహణను ఏపీ సీఎం మార్చేశారనే ఆరోపిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి.