నాయకులను చూస్తే ప్రజలు భయపడాలా? బురదలో రాళ్ళు వేయడం ఎందుకు? తప్పుకుని పోదాం అని ఆలోచించాలా? అసలు నాయకుల విషయంలో ప్రజలు ఎలా స్పందించాలని మన నాయకులు అనుకుంటున్నారు. లేకపోతే రాజకీయాలను పూర్తిగా దిగజారిస్తే ఇక మంచివాళ్ళకు అవకాశమే ఉండదని, అంతా మనమే ఏలుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు అనే విషయంలో తెలియదు కానీ నాయకులు మాత్రం హుందాతనానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు.
కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు, బాధ్యత గల ప్రజాప్రతినిధులం అన్న స్పృహ లేకుండా బజారులో నిలబడి మాట్లాడినట్టుగా మాట్లాడే నేతలు ఎపిలో చాలా మందే ఉన్నారు. వాళ్ళలో అగ్రగణ్యుడు జెసి దివాకర్‌రెడ్డి. ఇక జెసి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి అతనిని మించినవాడు. అలాగే ఆనం బ్రదర్స్ కూడా అదే కేటగిరీ. ఇంతకాలం కూడా ఇలాంటి నేతలు ఎపిలోనే ఉన్నారా? తెలంగాణాలో లేరా అన్న అనుమానాలు ఉండేవి. అసెంబ్లీ సమావేశాలతో సహా చాలా విషయాల్లో తెలంగాణా నాయకుల వ్యవహారం కాస్త పద్ధతిగానే ఉండేది. ఇప్పుడు దిగజారుడుతనంలో మాత్రం మేం ఎపి నాయకులకంటే ఎందుకు తగ్గుతాం అని తెరాస నాయకుడు, మంత్రి తలసాని శ్రనివాస యాదవ్ బయల్దేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో కూడా ఎన్నో డ్రామాలు ఆడి కామెడీ చేసిన తలసాని ఇప్పుడిక తన బూతు పంచాంగాన్ని వినిపించారు. ఒకే ఒక్క స్పీచ్‌తో జెసీ, ఆనం బ్రదర్స్‌ని దాటేసి తెలుగు లీడర్స్ అందరిలోకి అగ్రగణ్యుడు అనిపించుకున్నాడు. ‘కొడుకులు’ అన్న మాటను మాట్లాడే ప్రతి మాటకు ముందు వెనకాల తగిలించి నిజ జీవితంలో తన స్థాయి ఏంటో నిరూపించుకున్నారు. అలాగే పిసికితే చచ్చిపోతాడు అనేలా రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడిన మాటలు అయితే జుగుప్సాకరం. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఒక్కటే. ఒకే ఒక్క స్పీచ్‌తో తెలుగు నాట అత్యంత గొప్ప బూతు స్పీచ్ ఇవ్వగల నాయకుడిగా అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు శ్రీమాన్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు……కంగ్రాట్స్ సర్.