మహిళల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసి అభాసుపాలైన నటుడు చలపతిరావు దానిపై సంజాయిషీ ఇస్తున్నట్టుగా ఒక విడియో విడుదల చేశారు. తనకు మహిళలంటే చాలా గౌరవం అంటూ భార్య చనిపోయి నలభై ఏళ్లయినా తాను పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. అంతటితో ఆగివుంటే బావుండేది. కాని .. అడ్డమైన ఆడవాళ్ల వెంటపడలేదు అని జోడించారు! ఈ పదాల్లో ఎంత గౌరవం వుందో తేలిగ్గానే అర్థమవుతుంది. పక్కలో పామును పడుకోబెట్టుకోము కదా అంటూ పదే పదే ఆ పదం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎక్కువమంది బాధపడి వుంటే సారీ చెబుతానని మాత్రమే అన్నారు తప్ప మనస్పూర్తిగా పశ్చాత్తాపం పడింది లేదు.
వాస్తవానికి చలపతిరావు గతంలోనూ తన పాత్రలు చేసిన రేప్లన్నీ తానే చేసినట్టు 60 చేశాను 70 చేశాను అని గొప్పగా చెప్పగా ఒక పత్రిక కూడా ప్రముఖంగా ప్రచురించింది. కానిస్టేబుల్ వెంకట్రామయ్యలో జయసుధకు తండ్రిగా నటిస్తున్న చలపతిరావు ఆ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనూ ఇలాగే మాట్లాడారు. ఆమె పేరు చెప్పి.. ఆమెను ఎంతో మంది రేప్ చేశారు. చేయాలని ప్రయత్నించి వుంటారు. ఆమెకే లెక్క వుండకపోవచ్చని వికృత వ్యాఖ్యలు చేశారు.సినిమాల్లో పాత్రలే వుంటాయి గాని చలపతిరావు చేశాడనీ, ఫలానా నాయికను రేప్ చేశారని అనడం ఎంత అనాగరికం? పోనీ అందులో కామెడీ ఏమైనా వుందా అంటే వున్నది అసహ్యం మాత్రమే. ఆడియో ఫంక్షన్లో చలపతిరావు ఈ మాటలు అన్నప్పుడు వేదికపై వున్న వాక్చతురుడు పటాస్ రవి ఏదో ఒక భాషలో ఖండించాల్సింది పోయి అడిగిన అమ్మాయినే ఆటపట్టించడం కూడా అసహ్యంగానే వుంది. ఆ సభా ప్రాంగణంలో ఎ వరూ వెంటనే స్పందించకపోవడం కూడా బాధాకరం. బాలయ్య నుంచి బాబాయి చలపతిరావు వరకూ ఇలా మాట్లాడ్డం చిత్ర పరిశ్రమ ధోరణిని చెబుతుందా?