మహాభారతం గాథని వెండితెరపై తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీఏ శశికుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తారు. తెలుగు, తమిళం,హిందీ… ఇలా దాదాపు భారతీయ భాషలన్నీంటిలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. భీముడది పాత్రకు మోహన్‌లాల్‌ని ఎంచుకొన్నారు. అతి ముఖ్యమైన కర్ణుడి పాత్ర కోసం నాగార్జున పేరు పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి చిత్రబృందం నాగ్ ని సంప్రదించింది. ఈ విషయాన్ని నాగ్ ధృవీకరించారు కూడా. ”కర్ణుడి పాత్ర కోసం నన్ను అడిగారు. నేను చేయడానికి సిద్ధమే అని చెప్పా. కర్ఱుడు అనే కాదు.. ప్రాధాన్యం ఉన్న పాత్ర ఏదైనా సరే చేస్తా అన్నాను. స్క్రిప్టు కూడా చదివా. అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు కాదు… నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని పనులు పూర్తయ్యాక నా దగ్గరకు రండి అన్నాను” అని చెప్పుకొచ్చారు నాగార్జున.
కృష్ణుడి పాత్రకు అమీర్‌ఖాన్‌ని సంప్రదిస్తున్నట్టు వార్తలొచ్చాయి. వీటిపై నాగ్ స్పందిస్తూ.. ”మిగిలిన పాత్రలకు ఎవరెవరిని తీసుకొన్నారో నాకు తెలీదు. మోహన్ లాల్ మాత్రం ఉన్నారు. కాస్టింగ్ ఫైనలైజ్ అవ్వడానికి టైమ్ పడుతుంది” అన్నారు నాగ్. మరి కృష్ణుడి పాత్ర మీరే చేయొచ్చు కదా అని అడిగితే… ”దాని కోసం మీసాలు తీసేయాలి.. అలా తీస్తే ఫ్యాన్స్ చూడలేరేమో” అంటూ నవ్వేశారు నాగార్జున. సో.. మహాభారతంలో నాగ్ ఎంట్రీ ఖాయమన్నమాట.