తెలంగాణలో అర్జెంటుగా బిజెపిని అధికారంలోకి తేవడం కోసం ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా విస్త్రతంగా పర్యటిస్తున్నారు . దీని పూర్తి ప్రభావంపై సమీక్ష తర్వాత చేయొచ్చు.కాని నల్గొండ జిల్లా తెరేటిపల్లిలో ఆయన చేసిన సహపంక్తి భోజనం పార్సిల్ బయిటనుంచి రావడం పరిశీలకులను ఆకర్షించింది. అమిత్ షా నగ్జలైట్ల చేతుల్లో మరణించిన తమ పార్టీ నేత గుండగోని మైసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి జోహార్లర్పించారు. గ్రామంలోని దళిత బస్తీలో ఎంపిక చేసిన 17 ఇళ్లకు వెళ్లి కొన్ని చోట్ల విచారించి సమస్యలు తెలుసుకున్నారు.ఆ పైన సహపంక్తి భోజనం. అయితే ఆయన తిన్నది వేరు.తనకోసం ప్రత్యేకంగా తెప్పించిన భోజనమే తీసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.దీనిపై విచారించగా ఆయన జెడ్ ప్లస్ క్యాటగరీలో వున్నారు గనక భద్రత కోసం సిబ్బంది అలా చేశారని వివరణ ఇచ్చారు. అదే నిజమైతే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సామూహిక అంటూ ప్రత్యేక అయితే ఎలా అని చాలామంది అడిగారు.
వాస్తవానికి ఇలాటి సమస్య గతంలో కర్ణాటకలోనూ వచ్చింది గనక దీన్ని చెప్పాల్సి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి బిజెపి రాష్ట్ర అద్యక్షుడు యెడ్యూరప్ప తుంకూరు జిల్లాలో హనుమంతప్ప అనే దళితుడి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన టిఫిన్ తీసుకుంటారని చెప్పారు. తీరా చూస్తే హౌటల్ నుంచి తెప్పించి తిన్నట్టు వెల్లడైంది. దీనిపై ఒకాయన కేసు వేశారు. శాసనసభలోనూ చర్చ వచ్చింది. తన వెంట చాలామంది రావడంతో వారు వండింది అయిపోయింది గనక బయిటనుంచి తెప్పించాల్సివచ్చిందని సమర్థించుకున్నారు. పైగా ఇదంతా దళితులను అవమానించడమే నంటారు యెడ్డీ. మొత్తానికి రాష్ట్రాలు వేరు గాని రాజకీయం ఒకటేనా?