తన కెరీర్లో ఎప్పుడూ లేనంత సూపర్ ఫామ్ లో ఉన్నాడు నాగార్జున. వరుస విజయాలు.. నాగ్ క్రేజ్‌ని మరింత పెంచాయి. రిటైర్మెంట్ వయసులోనూ నాగ్ చూపిస్తున్న జోరు.. కొత్త కుర్రాళ్లకు పాఠాలు నేర్పేదే. తనకు తెలిసి, ఏ చిన్న తప్పూ చేయకూడదని నాగ్ గట్టిగా ఫిక్సయినట్టు కనిపిస్తోంది. అందుకే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. రీషూట్లకు కూడా వెనుకంజ వేయడం లేదు. రీషూట్ చేసి.. ‘మేం రీషూట్చేశాం’ అని ఘనంగా చెప్పుకొంటున్న నటుడు ఒక్క నాగార్జున మాత్రమే. సోగ్గాడే చిన్నినాయన సినిమాకి ఇలానే రీషూట్ చేశారు. ఫలితం కనిపించింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా విషయంలోనూ అంతే. ఆఖరి క్షణం వరకూ మార్పులూ చేర్పులూ చేశారు. ఈ విషయాన్ని నాగ్ సైతం అంగీకరించాడు కూడా.
ఇప్పుడు ‘రాజుగారి గది 2’కీ అంతేనట. ఈ సినిమా రషెష్ చూసిన నాగ్ అక్కడక్కడ తనకు తోచిన కొన్ని మార్పులు చెప్పాడట. కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని, రీషూట్ చేయమని ఆదేశించాడట. నాగ్ చెబితే ఇక తిరుగేముంది? అందుకే ఆయా సీన్లను మళ్లీ తెరకెక్కిస్తున్నారు. అందుకోసం నాగ్ మరో పది రోజుల కాల్షీట్లు అదనంగా ఇచ్చాడు కూడా. ”రాజుగారి గది సినిమా చూస్తున్నప్పుడు కొన్ని సందేహాలు వచ్చాయి. వాటిని నివృత్తి చేసేలా కొన్ని సీన్లు మార్చాం. అందుకోసం పది రోజుల కాల్ఫీట్లు కూడా ఇచ్చా” అంటున్నాడు నాగార్జున. ఒకవేళ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా హిట్టయిపోతే.. నాగ్‌కి రీషూట్లు చేసే సెంటిమెంట్ మొదలవుతుందేమో. రీషూట్ చేస్తే. సినిమా హిట్టే అనుకొంటే ప్రతీ ఒక్కరూ రిపేర్లకి దిగిపోతారుగా.