క్రమశిక్షణ తప్పితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి షరా మామూలు హెచ్చరిక జారీ చేశారు. అయితే ఆ పార్టీలో పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు సూక్తులకు సులభంగా తలవంచేవారెవరూ కనిపించడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండవలో వైసీపీ అభ్యర్థి నారాయణరెడ్డిహత్య,ప్రకాశం జిల్లాలో టిడిపికే చెందిన కరణం బలరాం-గొట్టిపాటి రవికుమార్‌ల ముఠాకక్షలలోఇద్దరి హత్య, పశ్చిమగోదావరి జిల్లాలోఎస్ఐని నేలపై కూచోబెట్టిన టిడిపి ఎంఎల్ఎ నిర్వాకం ఇలా చెప్పాలంటే మరీ ఈ వారం రోజుల్లోనే అనేక అఘాయిత్యాలు అరాచకాలు అగుపిస్తాయి.వీటిని అదుపు చేయడంలో గాని అణచివేయడంలో గాని అధిష్టానం విజయంసాధించలేకపోతున్నది. అసలు దూకుడుగా వుండాలని పదేపదే పార్టీ అధినాయకుడే చెబుతుంటే అనుయాయులు ఎందుకు సంయమనం పాటిస్తారని కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించిన తణుకు ఎంఎల్ఎ కృష్ణమూర్తిపై కేసు పెట్టినందుకు గాను తమ గన్మెన్లను వెనక్కు పంపేస్తామని తెలుగుదేశం ఎంఎల్ఎలు సామూహికంగా బెదిరించడం పరిస్థితికి ఒక నిదర్శనం.
రాజధాని సమీపంలోని కృష్ణా జిల్లాలో మరీ విజయవాడలో నిరంతరం ఏదో ఒక వివాదం జరుగుతూనే వుంది. వీటిపై కఠినంగా వ్యవహరించగల స్థితిలో చంద్రబాబు నాయుడు లేరన్నది అంతర్గత వర్గాల అంచనా.ఎన్నికలు రాబోతుండగా ఆయన పార్టీ ఘనాపాటీలతో పేచీ పెట్టుకోవడానికి సిద్దం కారు. పైగా లోకేశ్‌ను మంత్రిగా చేశాక అంతర్గతంగా నాయకత్వం పట్టు కొంత సడలిందనేది ఒక పరిశీలన. ఒకే ఒక నాయకుడు అన్న మాట సడలిపోయింది. పైగా ఎలాగూ మనకు ప్రాధాన్యత వుండదనే తెగింపు కూడా చాలామంది నేతల్లో వచ్చేసిందట. దాంతో పైకి ఏమి మాట్లాడినా తమ స్థానాన్ని తాము బలపర్చుకోవాలన్న తాపత్రయం పెరిగింది. నాయకత్వం వారి ప్రయోజనాలు చూసుకున్నప్పుడు మనం కూడా మన ప్రయోజనాలు కాపాడుకోవాలి కదా అని ఎవరికి వారే అనుకుంటున్నారు. పరస్పర పోటీ ఇంకా పరిస్థితిని దిగజారుస్తున్నది.ఫలితమే ఈ రణాలు రభసలూ హత్యలూ వివాదాలు వగైరాలు.