బిజెపి అద్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో చేసిన విమర్శలపైనా నిధుల బదలాయింపు గురించి చెప్పిన గొప్పలపైన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలస్యంగానైనా సరే ఆగ్రహంగానే స్పందించారు. రాజకీయంగా బిజెపిని ఎదుర్కొవడానికి టిఆర్ఎస్ వెనుకాడుతున్నదనే విమర్శను పూర్వపక్షం చేయడానికే ఆయన ఎక్కువ సమయం ఎక్కువ విషయాలు మాట్లాడారు. అయితే అమిత్‌షానూ టిబిజెపి నేతలైన లక్ష్మణ్ కిషన్ రెడ్డి వంటివారిని విమర్శించడం వరకూ తీవ్రంగానే మాట్లాడారు. ఇప్పుడు అధికారంలో లేని అద్వాణీపైన ఆగ్రహం వెలిబుచ్చారు. అయితే అసలు సిసలు అధినేత ప్రధాని మోడీని గాని కేంద్రాన్ని గాని పల్లెత్తు మాటనకుండా వదిలేశారు. పైగా నోట్లరద్దును స్వాగతించడంలో తాను బిజెపి ముఖ్యమంత్రులను కూడా దాటిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎను బలపరుస్తామని లోగడ వారి పార్లమెంటరీ నాయకుడు జితేందర్ రెడ్డి స్వయంగాప్రకటించి వుండగా కెసిఆర్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మెలిక పెట్టారు. అయితే మరో విధమైన ఆలోచన వున్నట్టు కూడా చెప్పలేదు. కాబట్టి ఆయన విమర్శలపై రాజకీయంగా బిజెపి పెద్దగా కలవరపడాల్సింది లేదు.
అయితే ఈ సందర్భంగా తను ప్రధాని అయినట్టు అప్పుడప్పుడూ కలవస్తుంటుందని కెసిఆర్ చెప్పడం ఆసక్తికరం. వచ్చినంత మాత్రాన అది జరుగుతుందో లేదో అందరికీ తెలుసని ఆయన అన్నారు. బిజెపి తెలంగాణలో అధికారంలోకి రావాలని చేస్తున్నప్రయత్నాలపై వ్యాఖ్యానించే సందర్భంలో ఆయన ఈ పోలిక తెచ్చారు.కాని నిజంగానే ఆ పార్టీలో అప్పుడప్పుడూ ప్రధాని చర్చ వస్తుంటుందని సన్నిహితులు చెబుతుంటారు. అసలు ఇప్పుడు దేశంలో అందరికీ ఆమోదం వుండే వ్యక్తి కెసిఆరే నని కూడా వారంటుంటుంటారు. కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి ప్రధాని కావాలనే ఆలోచన ఆయనకు వుందని బాగాదగ్గరగా వుండే ఒక సీనియర్ ప్రజా ప్రతినిధి ఒకసారి నాతో అన్నారు. అయితే జరుగుతదో లేదో అందరికీ తెలుసు అంటూ అస్పష్టంగా దాటేశారు ముఖ్యమంత్రి ఆ విషయాన్ని.