ఎంతైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆరే! మాటల గారడీ ఆయనకే సాధ్యం. తెలంగాణకు కేంద్రం భారీ ఎత్తున సాయం చేస్తోందనీ, ఆ సాయాన్ని ప్రజలకు అందించడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు భాజపా లక్ష కోట్లు ఇచ్చిందని ఆయన లెక్కలు చెప్పారు. అయితే, ఈ లెక్కలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. వాటా ప్రకారం రావాల్సినవే రాష్ట్రానికి వస్తున్నాయి తప్ప.. అంతకుమించి అదనంగా కేంద్రం ఇచ్చిందేమీ లేదని షా వ్యాఖ్యల్ని కేసీఆర్ కొట్టి పారేశారు. గతంలో కూడా తెలంగాణకు ఇచ్చింది రూ. 90 వేల కోట్లన్నారనీ, ఆ తరువాత ఇదే అంశమై చర్చించేందుకు సిద్ధమంటూ స్థానిక భాజపా నేతలు కూడా సవాలు విసిరారని కేసీఆర్ గుర్తుచేశారు. అయితే, అది వాళ్ల అజ్ఞానం కాబట్టి గతంలో తాను స్పందించకుండా ఊరకున్నానని చెప్పారు. ఇప్పుడు మరోసారి అవే లెక్కలు చెబుతూ ఉంటే స్పందించాల్సి వచ్చిందన్నారు.
దేశంలోని ధనిక రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. ఇతర దేశాలకు చెందిన రాయబారులు కూడా తనను మెచ్చుకున్న సందర్భాలున్నాయన్నారు. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ఎంతో కేంద్రమంత్రులు తన పనితీరును మెచ్చుకున్న సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణను ఒక మోడల్ గా తీసుకోవాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కేంద్రమంత్రి ఉమా భారతి సూచించారని అన్నారు. భాజపా నేతలంతా ఇంతగా మెచ్చుకుంటూ ఉంటే, అమిత్ షా మాత్రం అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శించారు. ఇతర నేతలు ఎవరైనా కామెంట్ చేస్తే పెద్దగా పట్టించుకోననీ, కానీ దేశాన్ని పాలిస్తున్న ప్రముఖ పార్టీ జాతీయ అధ్యక్షుడే ఇలా కామెంట్స్ చేస్తుండటంతో స్పందించాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో పార్టీని విస్తరించుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుందన్నారు. ఇక్కడ భాజపా సర్కారు చేయాలని వారికి ఉంటుందనీ… తనకు కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుందని కేసీఆర్ చమత్కరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు చెప్పి అమిత్ షాను ఇరకాటంలో పెట్టేందుకు కేసీఆర్ బాగానే ప్రయత్నించారు. పీఎం సహా కొంతమంది భాజపా పెద్దలే తెలంగాణను మెచ్చుకుంటున్నప్పుడు అమిత్ షాకు ఏమైందనే చర్చ మొదలయ్యేలా కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. అంతేనా… ఇలా అంటూనే, చిట్ట చివరగా ‘అయినా అమిత్ షాతో నాకెందుకు పంచాయితీ. జీవితంలో ఆయనతో భేటీ అయింది ఒకసారే కదా’ అంటూ ముక్తాయించారు. అంటే, అనాల్సినవన్నీ అనేసి, చెప్పాల్సిన లెక్కలు చెప్పేసి.. చివరికి విషయాన్ని లైట్ గా మార్చేయడం కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుందనడంలో సందేహం లేదు. దీంతో కేసీఆర్ తాజా వ్యాఖ్యలపై తెలంగాణ భాజపా నేతలు స్పందించడానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి కదా!