తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతున్న పరిస్థితి ఇది. పార్టీలో పేరున్న నాయకులు లేరు. ఉన్నవారు కూడా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. రాష్ట్రంలో బలమైన మూలాలు ఉన్నాయని చెప్పుకుంటున్న పార్టీకి సరైన దశా దిశా లేకుండా పోయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితమైపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో నిర్వహించిన మహానాడు ఎలా ఉండాలి..? అదీ చంద్రబాబు హాజరైన కార్యక్రమం అంటే ఏ స్థాయిలో ఉండాలి..? వచ్చే ఎన్నికల్లో అధికారం కోరుకుంటున్న ఒక పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రసంగం ఏ రీతన సాగాలి..? కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఏ స్థాయిలో ఎండగట్టాలి..? కార్యకర్తల్లో ఉత్సాహాన్ని ఏ విధంగా రెట్టించాలి..? అయితే, ఈ అంచనాలలో కొన్నింటినైనా అందుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు!
మహానాడు కార్యక్రమంలో ఆయన ప్రసంగం స్వోత్కర్షకే సరిపోయింది. గతమెంత ఘనకీర్తి అన్నట్టుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా సాధించిన విజయాలనే మళ్లీ మళ్లీ వల్లె వేశారు. ఎప్పుడో జమానా కిందట పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది మళ్లీ అన్నారు. హైదరాబాద్ ను హైటెక్ నగరంగా మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్నారు. కార్యకర్తలు ఎంతో ధైర్యంగా పోరాడుతూ ఉన్నారనీ, కార్యకర్తలే తన బలమని చెప్పారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉందనీ, తెలంగాణలో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పోరాడాలని చెప్పారు. ఇప్పటికే వారు పోరాడుతున్న తీరు బాగుందని మెచ్చుకున్నారు. ఇంతే, ఇలానే పేలవంగా సాగింది ఆయన ప్రసంగపాఠం.
ఆయన మాటల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఊసెత్తలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పాలన సాగుతోందనే అంశం జోలికే వెళ్లలేదు. సాగునీటి ప్రాజెక్టులపై వస్తున్న అవినీతి ఆరోపణలపైగానీ, కేసీఆర్ కుటుంబ పాలనపై వినిపిస్తున్న విమర్శలుగానీ, రాష్ట్రంలో ఉపాధి అవకాశాల గురించిగానీ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించిగానీ ఏమీ మాట్లాడలేదు. సరే… కేసీఆర్ ను విమర్శించే ఉద్దేశం ఆయనకి లేదో ధైర్యం చాల్లేదో అనేది కాసేపు పక్కన పెడితే… తెలుగుదేశం పార్టీ తెలంగాణకు చేయబోతున్నది ఏంటో అయినా చెప్పాలి కదా. మహానాడు ఉద్దేశం కూడా అదే కదా. టీడీపీ అధికారంలోకి వస్తే ఫలానా పనిచేస్తుందనిగానీ, ప్రస్తుతం ప్రజల తరఫున చేస్తున్న పోరాటాల గురించిగానీ చంద్రబాబు మాట్లాడలేదు.
కార్యకర్తలే భరోసా అన్నట్టుగా తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నట్టుగానే చంద్రబాబు మాట్లాడారు. అంతేగానీ, తెలంగాణలో కార్యకర్తలకు తాను భరోసా ఉంటున్నాననే ధైర్యాన్ని ఇవ్వలేకపోయారనే చెప్పుకోవాలి! చంద్రబాబు కంటే రేవంత్ కాస్త నయం. మైక్ దొరక్కగానే తనదైన శైలిలో కేసీఆర్ సర్కారుపై నాలుగు మాటలు మాట్లాడారు. కానీ, ఎందుకో చంద్రబాబే… తన చుట్టూ ఒక చట్రం బిగించుకుని, ఆ పరిధిలోనే మాట్లాడేసి మమ అనిపించేశారు. మొత్తానికి, ఈ మహానాడు టీడీపీ కార్యకర్తలపై కూడా ఆశించిన ప్రభావం చూపించకపోవచ్చు.