ఇంద్రగంటి మోహనకృష్ణది ఓ డిఫరెంట్ స్టైల్. చిన్న కథ, దాని చుట్టూ తమాషా సంఘటనలు, సున్నితమైన హాస్యం… ఇవే ఇంద్రగంటి ఆయుధాలు. అష్టాచమ్మా తోనే వినోదాత్మక సినిమాల స్కేల్ ఏంటో తనకు బాగా తెలిసిపోయింది. పూర్తి స్థాయి కామెడీ సినిమా ఎప్పుడు ట్రై చేసినా ఇంద్రగంటి హిట్టు కొట్టేశాడు. జెంటిల్మెన్తో తొలిసారి థ్రిల్లర్ కథని ఎంచుకొని… అందులోనూ విజయం సాధించాడు. ఇప్పుడు `అమీ తుమీ`తో మరోసారి నవ్వులు పంచేందుకు సిద్దమయ్యాడు. అవసరాల శ్రీనివాస్, అడవిశేష్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 9న విడుదల కాబోతోంది. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ సంపాదించుకొంది.
సెన్సార్ రిపోర్ట్ చూస్తే పాజిటీవ్‌గానే వచ్చింది. కుటుంబ సమేతంగా హాయిగా చూడదగ్గ సినిమాగా ఇంద్రగంటి అమీతుమీని మలిచాడని చెబుతున్నారు. ఇందులో ఇద్దరు హీరోలున్నా.. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్.. ఈ సినిమాని ముందుకు నడిపించిందట. అవసరాల, అడవిశేష్ కంటే వెన్నెల కిషోర్‌కే ఎక్కువ మార్కులు పడతాయని, తనికెళ్ల భరణి మరోసారి ఆకట్టుకొనే ప్రదర్శన చేశాడని చెబుతున్నారు. ఇషా ఈ సినిమాలో మరింత గ్లామరెస్ గా కనిపించిందట. మణి శర్మ స్వరాలు థియేటర్లో చూడ్డానికి బాగున్నాయని, పాటల పిక్చరైజేషన్లో ఇంద్రగంటి మార్క్ కనిపించబోతోందని తెలుస్తోంది. కథపరంగా గమ్మత్తులేం లేకపోయినా, సినిమా నడిపించిన తీరు మాత్రం బాగుందని, మల్టీప్లెక్స్ జనాలకు ఈ సినిమా మరింతగా నచ్చుతుందని చెబుతున్నారు. సో.. ఇంద్ర గంటి కామెడీ టైమింగ్ అమీతుమీకి ప్లస్ పాయింట్‌గా మారితే.. తన ఖాతాలో మరో హిట్టు పడడం ఖాయం.