కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.అంతకుమించి, ఆయన దృష్టిని ఆకర్షించడానికి ప్రతిపక్షంపైనా విమర్శలు చేశారు. పోలవరం రాష్ట్రానికి చంద్రవరమని అన్న ఆయన.. ముఖ్యమంత్రి పాలసీలు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నాయని పొగిడారు. కొత్తగా ఏర్పాటయ్యే విమానాశ్రయాల వల్ల రాష్ట్ర స్వరూపమే మారుతుందన్నారు. అదే సమయంలో ప్రతిపక్షంపైనా విమర్శలు కురిపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ అనుసరించిన దిగజారుడు విధానాల వల్ల అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించలేకపోయామన్నారు.
కేఈ చేసిన ఈ ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగానే ఉంది. ముఖ్యమంత్రికి వినసొంపుగానే ఉండవచ్చు. కానీ కలెక్టర్లకు అవసరమా! ఎందుకంటే కేఈ ఈ ప్రసంగాన్ని చేసింది.. ముఖ్యమంత్రిని భజించిందీ కలెక్టర్ల సదస్సులో. అధికారుల సదస్సులో సాధారణంగా దిశానిర్దేశం చేయాలి. ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడాలి.. ఎలా అమలు చేయాలి దిశా నిర్దేశం చేయాలి. కానీ భజన చేయడమేమిటి? చంద్రబాబును పొగడడానికి అధికార కార్యక్రమాన్ని వేదికగా చేసుకోవడం ఎబ్బెట్టుగా అనిపించింది. భజనకు ప్రత్యేక వేదికలుంటాయి. బహిరంగ సభల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరూ ఆక్షేపించరు. ఎవరికీ అభ్యంతరమూ ఉండదు. వీలు దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రిని విమర్శించే వారు పొగడ్డం కొత్తగానే ఉంటుంది. దీనివెనుక కారణం ఇటీవల కర్నూలు జరిగిన సంఘటనలై ఉండవచ్చు.