ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. `జయదేవ్` సినిమాతో. అటు దర్శకుడిగా జయంత్నీ, ఇటు సంగీత దర్శకుడిగా మణిశర్మని తీసుకొచ్చి.. టెక్నికల్‌గా స్ట్రాంగ్ టీమ్ ఉండేట్టు చూసుకొన్నాడు గంటా. డబ్బులు కూడా బాగానే ఖర్చు పెట్టార్ట. అయితే ఈ సినిమా విడుదలకు దగ్గరవుతున్నా.. ప్రమోషన్లు ఏమాత్రం కనిపించడం లేదు. అశోక్ కుమార్ పేరుకే నిర్మాత అని, తెర వెనుక డబ్బులు పెట్టింది గంటా శ్రీనివాసరావు అని అందరికీ తెలుసు. గంటా కోరు కొంటే కోట్లు గుమ్మరించి మరీ పబ్లిసీటీ చేయగలడు. కానీ… `జయదేవ్` మాత్రం పబ్లిసిటీ విషయంలో నీరసంగా ఉంది. జూన్ 9న ఈ సినిమాని విడుదల చేద్దామనుకొంటున్నారు. ఆరోజు రాబోయే సినిమాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ‘అమీతుమీ’లాంటి సినిమాలు ప్రమోషన్లను మొదలెట్టేశాయి. కానీ… ‘జయదేవ్’ మాత్రం ఇంకా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు అనిపించడం లేదు.
ఈ సినిమాకి ఎంత పబ్లిసిటీ ఇచ్చినా ప్రయోజనం లేదు అనుకొంటున్నారో, లేదంటే… ప్రమోషన్లపై అవగాహన లేక గాలికి వదిలేశారో అర్థం కావడం లేదు. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొండ శ్రీనివాస్ తొలి సినిమా ‘అల్లుడు శీను’కి ఎంత హడావుడి చేశారో చూడండి. ఓ పెద్ద సినిమా రేంజులో పబ్లిసిటీ ఇచ్చి, నిజంగానే ఓ పెద్ద సినిమాగానే విడుదల చేశారు. అంత కంటే ఎక్కువ స్టామినా ఉండి కూడా గంటా శ్రీనివాసరావు.. పబ్లిసిటీ గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.