భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం…వేదిక.. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల మైదానం… అమిత్ షా హాజరైన ఈ సభలో కేంద్ర మంత్రీ, పార్టీకి ఏపీలో పెద్ద దిక్కూ అయిన ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రసంగించడానికి లేచారు… భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు..అక్కడెవరు.. ఏదో మిస్ఛీఫ్ చేస్తున్నారు.. ఇది భారతీయ జనతా పార్టీ పద్ధతి కాదు..వారిని అదుపు చేయండి.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. హాజరైన వారికి ఆయనెందుకలా మాట్లాడుతున్నారో తొలుత అర్థం కాలేదు. దిక్కులు చూశారు. సభా వేదికకు కొద్ది దూరంలో తూర్పువైపున కార్యకర్తలు బృందంగా ఏర్పడి.. లీవ్ టీడీపీ.. సేవ్ బీజేపీ అనే నినాదాలు రాయించి ఉన్న ప్లకార్డులను చేతిలో పట్టుకుని ఆవేశంగా ఊగిపోతుండడం కనిపించింది. వారి ఉద్దేశం టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని.. ప్రసంగంలో ఎప్పుడూ తొట్రుపడని.. తడుముకోని.. ధారాళమైన వాగ్ధాటికి పేరున్న వెంకయ్య అసహనం వెనుక కారణం కొందరి అసంతృప్తి వెళ్ళగక్కడం.
నిజమే ఇలాంటి పనులు బీజేపీ క్రమశిక్షణకు మచ్చ తెచ్చేవే. ఎందుకింత దాకా వచ్చింది. బీజేపీ మొదటిసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సైతం టీడీపీతో ఎన్నికల బంధం ఉంది. ఇప్పుడూ ఉంది. ఆనాడు లేని రగడ నేడెందుకని ప్రశ్నించుకుంటే అన్ని వేళ్ళూ రాష్ట్రంలో పార్టీకి పెద్దన్న అయిన వెంకయ్య వైపు చూపిస్తున్నాయి. టీడీపీ అధినేతతో ఆయన అంటకాగుతుండడం వల్లే పార్టీ రాష్ట్రంలో ఎదగడం లేదని అంటున్నాయి. మంత్రులు సైతం టీడీపీ మంత్రుల్లా వ్యవహరిస్తున్నారు తప్ప పార్టీ అభివృద్ధికీ, ఎదుగుదలకూ చేస్తున్నదేమీ లేదనీ అంటున్నాయి. ఇందులో వాస్తవమెంతో పార్టీ అధినేతలకే ఎరుక. ఇటీవల కొంతకాలంగా ఏపీలో కీలక పరిణామాలు సంభవిస్తున్నప్పటికీ వెంకయ్య స్పందించకపోవడానికీ దీనికి ఏదైన లింకు ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఎదగకపోవడానికి వెంకయ్యే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ఆ పార్టీ నేత విష్ణుకుమారరాజు సైతం కీలక అంశాలలో టీడీపీకి వత్తాసు పలుకుతుండడాన్ని ఉదాహరణగా చెబుతున్నాయి.
ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది. ఇలాంటి అసహన చర్యల కారణం వెనుక కొత్త శక్తులున్నాయని వెంకయ్య మద్దతుదారులు అనుమానిస్తున్నారు. ఎప్పడూ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కే సంస్కృతిలేని పార్టీలో కార్యకర్తలు ఇలా చేయడం వెనుక 2014 తరవాత బీజేపీలో చేరిన నేతల `హస్తం` ఉందనేది వారి ఆరోపణ. ఏదైనా కావచ్చు.. ఎవరైనా కారణం కావచ్చు. కర్ణుడి చావుకు వేయి కారణాలన్నట్లు… క్రమశిక్షణాయుత పార్టీలో టీడీపీపై అమిత్ షా సమక్షంలో బహిరంగంగా వెల్లువెత్తిన నిరసన మైత్రీబంధానికి కటిఫ్ దిశగా తీసుకెడుతుందా… దీనికి సంబంధించి, చంద్రబాబుకు లంచ్ మీటింగ్లో అమిత్ ఇప్పటికే షా చెప్పారా.. తేలడానికి కొద్ది నెలలు అక్కర్లేదు.. రోజులు చాలు..
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి