అమరావతిలో డిజైన్లపేరిట మరో హడావుడి జరుగుతున్నది. ఏడాది పొడుగునా ఏదో రూపంలో ఆ పేరు వినిపిస్తుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహం. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి నార్మన్ పోస్టర్స్ సంస్థ ఇచ్చిన ఆకృతుల పరిశీలన చేశారు. రాజధాని నిర్మాణాలను ఉత్తరంగా ముందుకు జరుపుతారట. పది అంతస్తుల సచివాలయం కట్టాలని కూడా చెబుతున్నారు గనక ఇప్పుడున్నది తాత్కాలికమేనని తేలిపోయింది. ఈ సందర్భంగా హైపర్ లూప్తరహా రవాణా వ్యవస్థ వుండాలని ఆయన ఆదేశించారట. మెట్రో రైలు ,ఎలక్ట్రికల్ కార్లు, జలరవాణా, బిఆర్టిఎస్ వంటివాటికి చోటు కల్పిస్తారట. ఆలూలేదు చూలూ లేదన్నట్టు ఇదంతా ఇప్పటికి వూహ మాత్రమే. ఈ వూహల్లో మరో మహా వూహ ఏమంటే డ్రైవర్ లేని బస్సులను కూడా తీసుకురావాలని చంద్రబాబు సూచించడం.ఆయనకు
సాంకేతిక ప్రయోగాలంటే మోజు మాత్రమే గాక వాటి ద్వారా ప్రజలను ఆకర్షించాలని ఆశ. బ్రిటన్‌లో డ్రైవర్‌రహిత కార్లపై ప్రయోగాలు జరుగుతున్నా అనేక సందేహాలు కూడా మిగిలివున్నాయి. జిపిఎస్, రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే ఈ కార్లు అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితికి తగినట్టు వ్యవహరించగలవా లేక సమస్యలు వస్తాయా అని పరిశోధనలు జరుగుతున్నాయి.వూబర్ ఓలా వంటి క్యాబ్లలోఇప్పటికే కొంత వరకూ ఈ వ్యవస్థల వినియోగం జరుగుతున్నా అసలు డ్రైవర్ లేకపోవడం వేరు. అయినా సరే ఇటీవల తిరుపతిలో జరిగిన ఒక సభలో కూడా చంద్రబాబు ఈ తరహా కార్ల గురించి ప్రస్తావించి తన మోజును వెల్లడించారు. వాటిని అమరావతిలో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. మరీ ముందే కూసిన కోయిల వ్యవహారంలా అనిపించడం లేదూ?