తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
కొత్త వాళ్లని నమ్మడంలో, వాళ్లకు అవకాశాలు ఇవ్వడంలో నాగార్జున ఎప్పుడూ ముందే ఉంటాడు. కల్యాణ్ కృష్ణ అనే దర్శకుడ్ని ప్రోత్సహించడం వల్ల… నాగార్జునకు తన కెరీర్లోనే ది బెస్ట్ సినిమా వచ్చింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ రూపంలో. నాగ్ కెరీర్లో రూ.50 కోట్ల క్లబ్ లేని లోటుని ఈ సినిమా తీర్చేసింది. అందుకే… నాగార్జున కల్యాణ్ కృష్ణకు మరో అవకాశం ఇవ్వడంలో ఎలాంటి తప్పూ, వింతా లేదు. చైతూకీ ఓ భారీ కమర్షియల్ హిట్ కావల్సిన తరుణమిది. అందుకే… కల్యాణ్ కృష్ణకు వరుసగా రెండో ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. దాన్ని ఈ దర్శకుడు ఎంత వరకూ నిలబెట్టుకొన్నాడు. తొలి సినిమాతో ఆకట్టుకొన్న కల్యాణ్… ద్వితీయ వీఘ్నాన్ని దాటగలిగాడా?? రండి.. వేడుక చూద్దాం.
* కథ
భ్రమరాంబ (రకుల్‌ప్రీత్ సింగ్) కాస్త అమాయకత్వం, కాస్త పెంకితనం, కాస్త మొండితనం మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో తన క్యారెక్టర్ అలా ఉంటుంది. నాన్న ఆది (సంపత్) అంటే… పిచ్చి ప్రేమ. నాన్నకు తెలియకుండా, చెప్పకుండా ఒక్క అడుగు కూడా వేయదు. మరోవైపు బామ్మ (అన్నపూర్ణ) రాకుమారుడి లాంటి వాడు నీ కోసం ఆకాశంలోంచి దిగొస్తాడు, పూల బాట వేస్తాడు, పడవంత కారులో తీసుకెళ్తాడు అంటూ చిన్నప్పటి నుంచీ నూరి పోస్తుంటుంది. అందుకే తాను కూడా ఓ రాకుమారుడి కోసమే ఎదురుచూస్తుంటుంది. ఓ పెళ్లిలో శివ (నాగచైతన్య) భ్రమరాంబని చూసి ఇష్టపడతాడు. ఎంబీఏ చదవడం కోసం వైజాగ్ వస్తుంది భ్రమరాంబ. శివ ఉండేదీ అక్కడే. దాంతో.. శివ, భ్రమ కాస్త క్లోజ్ అవుతారు. కానీ… భ్రమరాంబ మాత్రం `ఇది స్నేహం మాత్రమే. ప్రేమ అన్నావంటే నీతో మాట్లాడను` అంటూ షరతు విధిస్తుంది. దాంతో తన ప్రేమనంతా మనసులోనే దాచుకొని స్నేహితుడిలానే ఉంటాడు శివ. మరి తన ప్రేమ విషయం భ్రమ రాంబకు ఎప్పుడు ఎలా చెప్పాడు? శివ నాన్న కృష్ణ (జగపతిబాబు)కీ భ్రమరాంబ నాన్న ఆదికీ ఉన్న పగ ఏంటి? వీరిద్దరి మధ్య శత్రుత్వం.. భ్రమరాంబ – శివల మధ్య ప్రేమకు ఎలా అడ్డుకట్ట వేసింది? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్‌కి న్యాయం చేయడం కోసం కల్యాణ్ కృష్ణ చాలానే కష్టపడ్డాడు. సినిమా మొత్తం ఓ వేడుకలా చూపించడానికి, వేడుకంత సందడి సృష్టించడానికి అడుగడుగునా తాపత్రయ పడ్డాడు. ఈ కథని ఓ పెళ్లితో మొదలెట్టడానికి కారణం అదే. పెళ్లంటే సంబరాలు.. హడావుడి.. ఉంటుంది కదా? దాంతో `వేడుక` మొదలైపోతుంది. కథ పరంగా కల్యాణ్ పెద్దగా ఆలోచించలేదు. `నిన్నే పెళ్లాడతా` సినిమాకి ఒకటికి పదిసార్లు చూసి ఆ స్ఫూర్తితో సన్నివేశాల్ని అల్లుకొన్నట్టు అర్థం అవుతుంది. పైగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ని బేస్ చేసుకొని రాసుకొన్న కథ ఇది. నాన్నంటే ప్రేమ… నాన్న చూసిన సంబంధాన్నే చేసుకోవాలని ఫిక్సయిపోవడం, బామ్మ చెప్పే క్వాలిఫికేషన్స్ ఉన్న కుర్రాడి కోసం ఆలోచిస్తూ గడిపేయడం.. ఇదీ భ్రమరాంబ క్యారెక్టరైజేషన్. ఆ పాత్రతో ప్రేక్షకుడు ప్రేమలో పడితే.. సినిమా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కనెక్ట్ కాలేదో…. ఏ సన్నివేశం బుర్రకు ఎక్కదు.
పెళ్లి హంగామా కలర్ఫుల్గా, తెర నిండా ఆర్టిస్టులతో సాగిపోతుంటుంది. ఒక్కో ఫ్రేముకీ ఒక్కో ఆర్టిస్టు అడుగుపెడుతుంటాడు. ఫృథ్వీ, తాగుబోతు రమేష్, రఘుబాబు, సప్తగిరి, పోసాని.. ఇలా దాదాపు అరడజను మంది సీనుకొక్కరు చెప్పున దిగిపోతుంటారు. కానీ… వాళ్ల నుంచి నవ్వులేం రావు. అసలు ఆ పాత్రల వల్ల దర్శకుడు ఏం చూపిద్దామనుకొన్నాడో అర్థం కాదు. సన్నివేశాలన్నీ బోరింగ్ గా ఉంటాయి. తరువాత ఏం జరుగుతుందో ఊహించేస్తాం. ఉదాహరణకు.. కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సీన్ మొదలైనప్పుడే హీరో రంగంలోకి దిగుతాడని, తన ఊరిని గెలిపిస్తాడని అర్థం అయిపోతుంది. పాము ఎపిసోడ్లో చైతూ వెంకీ తరహా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వబోతున్నాడని పసిగట్టేస్తాం. సంపత్కీ – జగపతిబాబుకీ మధ్య వైరం మొదలైనప్పుడే.. .జగపతిబాబు కొడుకుగా చైతూ ఎంటర్ అవుతాడని అర్థం అయిపోతుంది. ఏ సీన్ కొత్తగా ఉండదు.. దాంతో స్క్రీన్‌ప్లే కూడా తేలిపోతుంది. మలుపులేం లేకుండానే ఇంట్రవెల్ కార్డు పడిపోతుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలైనా…. అక్కడా ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురి చేసే సీన్లు ఉండవు. భ్రమరాంబతో వేగలేక శివ బ్రేకప్ చెప్పేసే సీన్ బాగా పండింది. అక్కడ శివ డైలాగులకు క్లాప్స్ పడతాయి. అలాంటి సీన్లు మరో రెండు మూడుంటే యూత్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవారేమో అనిపిస్తుంది. జగపతి బాబులోని నిజాయతీ సంపత్‌కి వివరించడం, చైతూ – రకుల్ లు ఒక్కటవ్వడం ఈ సినిమా క్లైమాక్స్. అదీ వీలైనంత చప్పగానే సాగింది. ద్వితీయార్థంతో పోలిస్తే.. ప్రధమార్థమే కాస్త బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. కథలో లెక్కకు మించిన పాత్రల్ని రాసుకోవడం కాదు, ప్రతీ పాత్రకూ కథలో లింకు ఉండేలా చూసుకోవాలి. ఆ విషయంలో తడబడ్డాడు దర్శకుడు. కృష్ణవంశీ తరహా ఫ్రేమింగ్ వరకూ ఓకే.. కానీ.. నటీనటులుతో స్క్రీన్ నిండుగా ఉండడం ఒక్కటే కాదు, అలా తీసిన సన్నివేశంలోనూ బలం ఉండాలి అనే విషయం కల్యాణ్ కృష్ణ తెలుసుకోవాలి.
* నటీనటులు
చైతూ – రకుల్ – జగపతి – సంపత్ .. ఈ నాలుగు పాత్రలూ ఈ కథకు కీలకం. నలుగురూ బాగా చేశారు. చైతూ ఈ సినిమాలో మరింత ఈజ్ తో నటించాడు. అల్లరి సీన్లు ఎంత బాగా చేశాడో, తండ్రితో ఎమోషనల్ డైలాగులు చెప్పేటప్పుడూ అదే స్థాయిలో ఆకట్టుకొన్నాడు. భ్రమరాంబగా రకుల్ మంచి ఛాయిసే. చాలా అందంగా, పద్దతిగా కనిపించింది. అయితే అక్కడక్కడ లిప్ సింక్ మ్యాచ్ అవ్వలేదు. రకుల్‌కి తెలుగు బాగా వచ్చు. అయినా.. లిప్ సింక్‌లో జాగ్రత్త తీసుకోకపోవడం విచిత్రమే. జపగతిబాబు, సంపత్.. వీళ్ల గురించి చెప్పేదేముంది? ఆయా పాత్రలకు వన్నె తెచ్చారు. మిగిలిన ఏ ఒక్క పాత్రపై దర్శకుడు శ్రద్దపెట్టలేదు.
* సాంకేతికంగా…
దేవిశ్రీ పాటలు మళ్లీ మళ్లీ వినాలపించేంత గొప్పగా లేవు. కానీ… తెరపై మాత్రం బాగానే ఉన్నాయి. భ్రమరాంబకు నచ్చేశా.. పాట జోష్‌గా సాగింది. ఆర్.ఆర్‌లో మాత్రం దేవి మార్క్ కనిపించలేదు. లాగ్ అనిపించే సీన్లు చాలా ఉన్నాయి. వాటిని ముందే గుర్తించి ఎడిట్ చేస్తే.. కథనంలో వేగం అయినా కనిపించేది. `నిన్నే పెళ్లాడతా` లాంటి సినిమా చైతూతో తీయాలని కల్యాణ్ కృష్ణ ఫిక్సయిపోయాడు. ఆ కొలతలతో కథ రాసుకొన్నా.. అంత ఫీల్, ఆ మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేయలేకపోయాడు.
* ఫైనల్ టచ్ : వేడుకలో సందడి తగ్గింది
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5