తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలనే డిమాండ్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఇద్దరు చంద్రులూ ఇదే విషయమై చాలాసార్లు కేంద్రానికి విన్నవించుకున్నారు. వీలైనంత త్వరగా నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ జరగాలని ఆశిస్తున్నారు. తెలంగాణలో జిల్లాల సంఖ్యను కేసీఆర్ పెంచుకున్నారు. పాలనా సౌలభ్యం కోసమే పెంచామని చెప్పుకున్నారు. ఆంధ్రాలో ఆ ఊసే లేదు. అయితే, నియోజక వర్గాల సంఖ్య పెంచడం మాత్రం అనివార్యం అనే అభిప్రాయాన్ని అమిత్ షా ముందు చంద్రబాబు ప్రస్థావించినట్టు సమాచారం. అమిత్ షాకు ఆయన చెప్పిన కారణం కూడా అందరికీ తెలిసిందే. వివిధ పార్టీల నుంచీ ఇప్పటికే చాలామంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు వచ్చారనీ, వారందరికీ అవకాశాలు కల్పించాలంటే అసెంబ్లీ సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది.
దీనిపై అమిత్ షా కూడా నర్మగర్భంగా స్పందించడం విశేషం! అసెంబ్లీ సీట్లను పెంచడం వల్ల మాకేంటి అన్నట్టుగా మాట్లాడినట్టు కథనం. ఆంధ్రాను ఉదహరించకుండా.. తెలంగాణ గురించి మాట్లాడుతూ.. ఆ రాష్ట్రంలో సీట్లు పెంచితే తెరాస, ఎమ్.ఐ.ఎమ్.లకు మరింత మేలు చేసినట్టు అవుతుందిగానీ, బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదని నిపుణులు తనతో చెబుతున్నారంటూ అమిత్ షా అన్నారట. కాబట్టి, సంఖ్య పెంపుదల అనే అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఏదేమైనా, రాష్ట్రపతి ఎన్నికల తరువాతే ఈ టాపిక్ గురించి ఆలోచిస్తామనీ, ఈలోగా ఈ ప్రస్థావన గురించి మాట్లాడమని చెప్పినట్టు కథనం.
సీట్ల సంఖ్య పెంచాలంటే భాజపాకి ఉపయోగకరమో కాదో అనేది ఇకపై అమిత్ షా స్టడీ చేస్తారు. ఒకవేళ భాజపాకి ఉపయోగం ఉందనుకుంటేనే ఈ సంఖ్య పెరుగుదల ఉంటుందని అనుకోవాలి. లేదంటే లేదనే అనుకోవాలి. అంటే, కేవలం వారి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే సీట్ల సంఖ్య పెంపుదల నిర్ణయం తీసుకుంటారన్నమాట! ఆ మాటకొస్తే.. తెరాస, టీడీపీలది కూడా ఈ విషయంలో రాజకీయ ప్రయోజన ధోరణే. ఎందుకుంటే, రెండు పార్టీల్లోనూ జంప్ జిలానీలు చాలామంది ఉన్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో ఎక్కడో చోట సీటు చూపించకపోతే అసమ్మతి సెగలు గుప్పుమంటాయి. ఈ విషయం అమిత్ షాకి తెలియనిదా..!
అందుకే, చంద్రబాబు చెప్పారనో, కేసీఆర్ కోరారనో నియోజక వర్గాల సంఖ్య పెంచే నిర్ణయం గురించి ఆలోచించరు. దీన్ని వీలైనంత కాలం వాయిదా వేస్తూ పోతారేమో. ఈ అంశంతో టీడీపీ, తెరాసలను తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. తెలుగు రాష్ట్రాల్లో భాజపాని విస్తరించేస్తాం అనే ఊపు ప్రస్తుతం రాష్ట్ర వర్గాల్లో కనిపిస్తోంది. ఇంకొన్నాళ్లు గడిస్తే తప్ప ఈ ఊపు ఉపయోగం ఏమాత్రమో అర్థం కాదు. ఒకవేళ సొంతంగా భాజపాకి ఊపు వస్తోందని అనిపిస్తే… తెరాస, టీడీపీలతో డీల్ చేసే విధానం వేరుగా ఉండొచ్చు! లేదూ, ఇద్దరు చంద్రులతో పొత్తు అనివార్యంగా కనిపిస్తే.. అప్పుడు డీల్ చేసే తీరు మరోలా ఉండొచ్చు. నియోజక వర్గాల సంఖ్య పెంపుదలపై అమిత్ షా అధ్యయనం ఇదే కోణంలో ఉండొచ్చు!