మహానాడుకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రాంగణమంతా బంతిపూల వనంగా మార్చేశారు. బ్యానర్లూ ఫ్లెక్సీలతో నింపేశారు. ఇక్కడి నుంచే అసలు కథ షురూ! ఈ బ్యానర్లలో నందమూరి బాలకృష్ణకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. మహానాడు అంటే ఎన్టీఆర్ బ్యానర్లు, తరువాత చంద్రబాబువి ఉంటాయి. కానీ, ఈసారి విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే రామకృష్ణబాబు పెట్టించిన ఫ్లెక్సీలో తప్ప, మరెక్కడా బాలయ్య ఫొటో కనిపించడం లేదట! ఇక, చినబాబు చిత్రాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఫొటోలు చాలా దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, ఒకచోట అయితే మదర్ థెరెస్సా ఫొటో పక్కన లోకేష్ బాబు ఫొటో పెట్టిన బ్యానర్లూ ఉన్నాయి.
ఇది ఎలాగూ ఊహించినదే! ఎందుకంటే, సీఎం చంద్రబాబు తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను ప్రమోట్ చేసుకుంటారు అనేది సర్వ సాధారణం. ఈరోజుల్లో ఏ నాయకుడైనా అదే చేస్తారు. అయితే, మంత్రి అయిన తరువాత జరుగుతున్న ఈ మహానాడులో నారా లోకేష్ ప్రసంగం ఎలా ఉంటుందనే చర్చ ఇప్పట్నుంచీ మొదలైంది. ఎందుకంటే, గతంలో తడబడుతూ, తప్పులు మాట్లాడిన లోకేష్ పై ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. మంత్రిగా ప్రమాణం చేసిన రోజున, ఆ తరువాత మరో బహిరంగ సభలో నోరు జారడంపై సోషల్ మీడియాలో కూడా తీవ్రమైన చర్చే జరిగింది. సో… ఇవన్నీ దృష్టిపెట్టుకుని లోకేష్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఒక నిపుణుడిని కూడా నియమించుకున్నట్టు గతంలో కథనాలు వచ్చాయి. ఇకపై నారా లోకేష్ ప్రసంగాలు ప్రభావంతంగా ఉండేందుకు చేయాల్సిన హోమ్ వర్క్, ప్రిపరేషన్, కసరత్తులు అన్నీ చేస్తున్నారని అన్నారు.
మామూలు సభలకీ, మహానాడుకీ చాలా తేడా ఉంటుంది కదా. ఇక్కడ సుదీర్ఘ ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. పైగా, చంద్రబాబు తరువాత ఆ స్థాయిలో లోకేష్ మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఈ నేపథ్యంలో చినబాబు ఈసారి ఎలా మాట్లాడుతారో అనే గుబులు టీడీపీ శ్రేణుల్లోనూ ఉందని తెలుస్తోంది. ఈసారైనా ఎలాంటి అచ్చుతప్పులు లేకుండా మాట్లాడితే బాగుండు అంటూ కొంతమంది టీడీపీ కార్యకర్తలే అంటున్నారట! ఎందుకంటే, మామూలు సభల్లో మాట జారినా ఫర్వాలేదుగానీ, మహానాడులో జారితే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇప్పటికే ప్రతిపక్షం కాచుకుని కూర్చుంది. మహానాడు అనేది ఒక ఆత్మస్తుతి, పరనిందకు వేదిక అంటూ ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టేసింది. ఈ నేపథ్యంలో లోకేష్ ప్రసంగంపై ఆసక్తి నెలకొందనే చెప్పాలి. మరి, దీన్ని చినబాబు ఎలా అధిగమస్తారో వేచిచూడాలి.