రాంగోపాల్ వర్మ… పబ్లిసిటీ పిచ్చకి పరాకాష్ట అంటూ భవిష్యత్తులో ఎవరైనా గూగూల్లో సెర్చ్ చేస్తే.. కచ్చితంగా ఈయన గారి బొమ్మ పడాల్సిందే. ఆర్ జీ వీ అంటూ పెద్ద పెద్ద అక్షరాలు మెరిసిపోవాల్సిందే. పబ్లిసిటీ పీక్స్ అంటారే… దానికి సింబల్ రాంగోపాల్ వర్మ. ఏదో ఓ కొత్త ఎత్తుగడతో మెస్మరైజ్ చేస్తుంటాడు. పట్టించుకోకుండా ఉండాలి అని ఎంత అనుకొన్నా… పట్టుబట్టి మరీ పట్టించుకొనేలా చేస్తాడు. ఈ విషయంలో మాత్రం వర్మ స్ట్రాటజీకి అస్సలు తిరుగులేదు. తాజాగా ఇంకో షాక్ ఇచ్చాడు. ట్విట్టర్ ఖాతాకు గుడ్ బై చెబుతూ… వర్మ ఆఖరి ట్వీట్ చేసేశాడు. ట్విట్టర్ నుంచి బయటకు వెళ్లిపోతున్నానని, ఇక నుంచి తన అభిప్రాయాల్ని వీడియోల రూపంలో, ఇన్స్ట్రగ్రామ్ లోనే చెబుతానని సెలవు తీసుకొన్నాడు. తన ట్విట్టర్ ఖాతాకు రిప్ కూడా ప్రకటించేశాడు.
ఎనిమిదేళ్లుగా ట్విట్టర్ ఖాతాతో్ చెడుగుడు ఆడుకొని, ప్రతీసారి తన పబ్లిసిటీకి వాడుకొంటూ, తన ఇమేజ్ పెంచుకొంటూ, తలదిక్క ట్వీట్లతో ఆశ్చర్య పరుస్తూ, మీడియాకు బోల్డంత టైమ్ పాస్ కలిగించిన వర్మకు ఇంత సడన్గా ఎందుకు జ్ఞానోదయం అయ్యిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ట్విట్టర్ ఖాతాని రాంగోపాల్ వర్మలా ఎవ్వరూ విచ్చలవిడిగా వాడుకోలేదన్నది అక్షర సత్యం. అసలు ట్విట్టర్ లో వచ్చాకే వర్మలోని మరో కోణం బయటపడింది. వర్మ ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారంటే…. ట్విట్టర్ ప్రపంచంలో అతని ఫాలోయింగ్ ఏపాటిదో అర్థం చేసుకోవొచ్చు. వర్మ సినిమాల కంటే ట్వీట్లే రసవత్తరంగా ఉన్నాయనడంలోనూ ఎలాంటి సందేహం అక్కర్లెద్దు. మరి అలాంటి ట్విట్టర్ పిట్టని ఎందుకు చంపేసినట్టు..?? ఎందుకు దూరమవుతున్నట్టు? ఇందులోనూ ఏమైనా మర్మం ఉందా? దీన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ కోసమే వాడుకొంటున్నాడా? ఆ ఛాన్సులు పుష్కలంగానే ఉన్నాయి. `నామాట మీద నేను నిలబడను..` అని చెప్పే వర్మ.. పుసుక్కున ఈ మాటనీ విత్డ్రా చేసేసుకోవొచ్చు. లేదంటే సడన్గా `నా ట్విట్టర్ ఖాతాని ఎవరో హ్యాక్ చేశారు` అనొచ్చు. ఏమైనా జరగొచ్చు. ఈమధ్య మాత్రం తనకు మరింత పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఈమధ్య తుపాకులు తొడలు అనే వెబ్ సిరీస్ మొదలెట్టాడు కదా.. పనిలో పనిగా దానికీ ప్రచారం జరిగిపోతుంది. వర్మ ట్రిక్కు అదే అయ్యుంటుంది. పెగ్గు దిగి కాస్త మత్తు వదిలితే.. వర్మ నుంచి అసలు మనిషి బయటకు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. ఏంజరుగుతుందో..?