ఈ రోజుల్లో బడ్జెట్ ఇంతైంది, అంతైంది అని చెప్పుకోవడం కామన్ అయిపోయింది. రూపాయి ఖర్చయితే.. నాలుగు రూపాయలు అయ్యిందని బిల్డప్పులిస్తున్నారు. పెద్ద సినిమాలకు ఖర్చెలాగూ తెరపై కనిపిస్తుంటుంది. చిన్న సినిమాలు మైకు పట్టుకొని మరీ గొంతు చించుకొంటున్నాయి. ‘గరుడ వేగ’ పరిస్థితీ అంతే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి రూ.25 కోట్లబడ్జెట్ అయిందంటూ చిత్ర బృందం పబ్లిసిటీ చేసుకొంటోంది. రాజశేఖర్ కి అంత మార్కెట్ లేదు. అసలు ఈయనగారు సినిమాలు చేసే చాలాకాలం అయ్యింది. ప్రవీణ్ సత్తారు సినిమా అనగానే ఎగబడి చూసేసేంత స్కోప్ లేదు. సినిమా బాగుంటేనే థియేటర్‌కి వెళ్తారు. స్వతహాగా నిర్మాత కూడా అయిన ప్రవీణ్ కి ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి ఈ సినిమా రూ.10 కోట్లలోపే తీయాలని ప్లాన్ చేశారు. సన్నిలియోన్ తో పాటు, పేరున్న కాస్టింగ్ పెట్టుకోవడం వల్ల మరో రెండు కోట్లు అదనంగా ఖర్చయ్యాయట. పబ్లిసిటీ కోసం కోటి రూపాయలు అనుకొన్నా రూ.13 కోట్లలో సినిమా పూర్తయినట్టే. సో.. రూ.25 కోట్లన్నది కేవలం సబ్లిసిటీ స్టంట్ కోసమే.