ఈ దఫా మహానాడులో ఎప్పటిలా వైఎస్ఆర్సిపి పైన దాని అధినేత జగన్‌పైన దాడి తక్కువగానే వుందని మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. బహుశా దాన్ని పూరించడానికన్నట్టు యువ(రాజ)మంత్రి లోకేశ్ తన ప్రసంగంలో ఆ ప్రస్తావనలు చేశారు. సమయం లేదని బెల్ కొట్టిన తర్వాత నవ్వులతో తన మాటలు కొనసాగిస్తూ ఏ పని చేయబోయినా అడ్డుపడుతున్నారని రెండు మూడు ఉదాహరణలిచ్చారు. ఇలా అన్నిటికీ ఆ దొంగబ్బారు అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. అంటే ఎవరో మీకు తెలుసా కదా అని అడుగుతూ హుషారెక్కించే ప్రయత్నం చేశారు గాని ఎందుకో అంత స్పందన మాత్రం రాలేదు! చాలా పదాలు ప్రయోగాలూ ముందే తయారు చేసుకుని మాట్లాడినా ప్రతినిధులు నిర్వికారంగా వినడమే కనిపించింది. మనవడిని చూడకుండా ముఖ్యమంత్రి తాత, ఫోన్లో ఫోటోలు చూసుకుంటూ తాను కాలం గడుపుతున్నామంటే ఇంత కష్టపడ్డం ఎందుకుని ప్రశ్నించారు. వేదికపై వున్న అద్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కుమారుడు ఎలా మాట్లాడతాడని నిశితంగా గమనించడం కనిపించింది. అంతేగాక లోకేశ్ కనీసం అరడజను సార్లు మాటలు తప్పు పలకడం బాగాలేదు. ఆ మాత్రం సన్నాహం ఎందుకు చేయరో అర్థం కాదు. ఇవన్నీ చూపిస్తూ ఆయనను మొద్దబ్బాయి అని వైసీపీ వారు గేళి చేస్తుంటారు. ఆయనేమో జగన్‌ను దొంగబ్బాయి అని నామకరణం చేశారు. ఈ ఇద్దరి ప్రచ్చన్న యుద్ధానికి మహానాడు వేదిక కావడం విశేషం. మాట్లాడటమే రాని మొద్దబ్బాయి కంటే తమ నాయకుడే వందరెట్లు మేలని వైసీపీ నేత ఒకరన్నారు.
ఇక చంద్రబాబు తన ప్రసంగం చేస్తుందగా వేదికపై నాయకులు మాట్లాడుకోవడం భరించలేక క్రవశిక్షణ పాఠాలు చెప్పారు. ఇదంతా అరాచకం అనే మాట కూడా వాడారు. తాను ప్రజల కోసం ఆలోచిస్తుంటే ఫోటోల కోసం చూస్తున్నారనీ వేదికపైనే గ్రూపుల వారిగా మాట్లాడుతున్నారని తీవ్రంగానే మందలించారు. కార్యకర్తలతో సమస్య లేదు నాయకులతోనే చిక్కు అని ఆయన అన్నప్పుడు మాత్రం మంచిస్పందన వచ్చింది. ఇది ఆ పార్టీ అంతర్గత పరిస్థితికి ప్రతిబింబం అనుకోవచ్చు.