టిడిపి నాయకుడు గద్దె బాబూరావు సుదీర్ఘంగా ప్రసంగిస్తున్న సమయంలో మధ్యలోనే జోక్యం చేసుకున్న చంద్రబాబు…..పార్టీ నాయకులు ప్రజలను ఆకట్టుకోగలిగేలా మాట్లాడాలని చెప్పారు. వేదికపై మాట్లాడుతున్నారంటే ప్రజల్లో ఒక ఊపు వచ్చేలా ఉండాలి అని చెప్పుకొచ్చాడు చంద్రబాబు. ఇప్పుడు ఇదే విషయంపై నెట్లో జోకులు పేలుతున్నాయి. ప్రసంగాల విషయంలో చంద్రబాబు చాలా వీక్ అని సాక్షాత్తూ టిడిపి నాయకులే అంతర్గతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అధికారుల మీటింగ్ అయినా, నాయకులతో మీటింగ్ అయినా చంద్రబాబు మాట్లాడడం మొదలెట్టాడంటే ఇక బ్రేకులంటూ ఉండవు. ఈ విషయంలో టిడిపి అనుకూల మీడియా జనాలు కూడా చంద్రబాబుపై సుతిమెత్తని విమర్శలతో ఎన్నో సార్లు సూచనలు చేశారు. ఇక చంద్రబాబు ప్రసంగ శైలి కూడా మరీ ఆసక్తికరంగా ఏమీ ఉండదు.
చంద్రబాబు ప్రసంగ శైలి గురించే రకరకాలుగా చర్చించుకుంటూ ఉండే టిడిపి జనాలకు చినబాబు లోకేష్ ప్రసంగాలు సూపర్ షాక్ ఇచ్చాయి. మైక్ చేతికి దొరికితే ఏం మాట్లాడతాడో కూడా తెలియనంతగా తప్పులు మాట్లాడేస్తూ ఉంటాడు లోకేష్. అలాగే ఎన్నో అక్షర దోషాలు కూడా దొర్లుతూ ఉంటాయి. తాజాగా మహానాడులో చేసిన ప్రసంగం సందర్భంగా కూడా అలాంటి తప్పులు చాలానే చేశాడు లోకేష్. ఇక నందమూరి బాలకృష్ణ ప్రసంగాల గురించి అయితే చెప్పనవసరం లేదు. వెండితెరపై చాలా మంది ఇతర హీరోలకు సాధ్యం కాని రీతిలో పేజీలకు పేజీల డైలాగులను అద్భుతంగా చెప్పే బాలయ్య రాజకీయ వేదికలపై మాత్రం చిన్నపిల్లాడు అక్షరాల కోసం వెతుక్కుంటున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఆపుతాడో కూడా ఎవ్వరూ చెప్పలేరు. ఏం మాట్లాడుతన్నాడో కూడా చాలా సార్లు స్పష్టంగా అర్థం చేసుకోలేం. అలాంటి నేపథ్యంలో ప్రసంగాలు ఆసక్తికరంగా ఉండాలి….పసలేని ప్రసంగాలు వద్దు అంటూ బాబు చెప్పిన మాటలపై సెటైర్స్ పడకుండా ఎలా ఉంటాయి?