ఈమధ్య హీరోలు కూడా పబ్లిసిటీ గిమ్మిక్కులు నేర్చారు. ఏదోలా.. తమ సినిమానో, తమనో ప్రమోట్ చేసుకోవడంలో బిజీ అవుతున్నారు. తాజాగా రామ్‌చరణ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఈమద్య చరణ్ తన సినిమాల పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కేవలం ప్రమోషన్లను స్పీడప్ చేయడానికి ఉపాసననీ సాయం తీసుకొచ్చాడు. సుకుమార్‌తో చేస్తున్న సినిమా విషయాలు ఎప్పటికప్పుడు ట్విట్టర్లో అప్డేట్ పెడుతున్నాడు. ఒక రకంగా తన సినిమాని తానే పీఆర్ అయిపోతున్నాడు. అందులో భాగంగానే ఈమధ్య ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘సుకుమార్ సినిమా టైటిల్ విషయంలో సాయం చేయండి’ అంటూ ఫ్యాన్స్‌ని వేడుకున్నాడు. సుకుమార్ దగ్గర నాలుగైదు టైటిళ్లు రెడీగా ఉన్నాయని, అందులో ఒకటి ఫిక్స్ చేయాల్సిందిగా ఒత్తిడి పెంచమని.. ఫ్యాన్స్‌ని కోరుకొన్నాడు. ఓ హీరో.. టైటిల్ కోసం ఫ్యాన్స్ సహాయం తీసుకోవడం బహుశా ఇదే తొలిసారేమో.
అయితే ఇదంతా పబ్లిసిటీ ట్రిక్ గానే కనిపిస్తోంది. సినిమా టైటిలేంటో సామాన్య జనానికి తెలియకపోవొచ్చు. హీరో రామ్‌చరణ్ కైనా సుక్కు చెప్పేసి ఉంటాడు కదా? టైటిల్ విషయంలో సుక్కు పడుతున్న టెన్షన్ చెర్రీకి తెలియంది కాదు. ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ప్రత్యేకంగా ఒత్తిడి తీసుకురావడం ఎందుకు..? ప్రస్తుతానికి చరణ్ సినిమా షూటింగ్ జరుపుకోవడం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేద్దామని… టైటిల్‌ని చరణ్ అడ్డుపెట్టుకొన్నాడేమో అనిపిస్తోంది. ‘రేపల్లె’ టైటిల్ దాదాపుగా ఫిక్సయిపోయింది. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ కూడా అదే. ఈ సంగతులన్నీ రామ్ చరణ్‌కి తెలియనివి కావుగా. అయినా… ఈ వీడియోలు, పోస్టింగులు, ఫ్యాన్స్ సహాయాలు ఇవన్నీ ఎందుకు..? పబ్లిసిటీ కోసం కాకపోతే..!!