తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని అసంతృప్తులకు మహానాడు అద్దం పట్టిందని చెప్పాలి! అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయినవారి సంఖ్య కూడా బాగానే ఉంది. నందమూరి కుటుంబం మొత్తం ఈ మహానాడుకు ఫుల్ ఆబ్సెంట్. ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యక్రమంలో కనిపించలేదు. ఇక, పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ కూడా కనిపించలేదు. టీడీపీపై నందమూరి ఫ్యామిలీ ముద్రను సమూలంగా తుడిచేసి, నారా వారి ముద్రేయడం హిడెన్ అజెండా అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు! ఆ విషయం కాసేపు పక్కన పెడితే… టీడీపీలో ప్రముఖులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్తులుగా పేరున్న ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా మహానాడుకు హాజరు కాలేదు.
ఆయన ఎందుకు హాజరు కాలేదూ అంటే… ఏవో అత్యవసర పనులు వచ్చి పడ్డాయీ, అందుకే రాలేకపోయారు అని సర్దిచెప్పుకునే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు! మహానాడుకు వెళ్లాలని మొదట్నుంచీ అనుకోలేదనీ, అంతకుమించి ఆయన గైర్హాజరీకి వేరే కారణాలు లేవని రాయపాటి అనుచరులు అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయం తెలుగుదేశం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, చంద్రబాబుపై ఇంత బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయడం అనేది పార్టీలో ఉండదు కదా! గత కొంతకాలంగా ముఖ్యమంత్రి తీరుపై రాయపాటి అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు తాను ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నా.. పార్టీలో తనకు సరైన గుర్తింపు రావడం లేదని రాయపాటి అసంతృప్తిగా ఉంటున్నట్టు తరచూ వినిపిస్తూనే ఉంది.
ఈ మధ్యనే.. విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో రైల్వే జోన్ విషయమై ముఖ్యమంత్రి ప్రయత్నాన్నే రాయపాటి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రధానిని కలుస్తున్నా రైల్వే జోన్ ఎందుకు రావడం లేదని తప్పుబట్టారు. ఈ హామీ అమలు విషయమై చంద్రబాబు ప్రయత్నం చాలదన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక, టీటీడీ ఛైర్మన్ పదవి విషయంలో కూడా రాయపాటి అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీకి ఎంతో సేవ చేస్తున్న తనకే ఆ పదవి రావాలని అనుచరులతో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, పార్టీలో తనకు గుర్తింపు పెరగకపోతే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటానంటూ కార్యకర్తలతో చెప్పినట్టు కూడా కథనాలు వినిపించాయి. సో.. ఓవరాల్ గా చంద్రబాబు తీరుపై రాయపాటిలో అసంతృప్తి కాస్త తీవ్రంగా ఉందని అర్థమౌతోంది. దాన్ని మరోసారి ప్రముఖంగా బయటపెట్టుకునేందుకు మహానాడు వేదికగా మారింది. తరువాత పరిణామాలు ఎలా మారతాయో చూడాలి..!