ఆయన వయసు 67… నా వయసు 34…. ఆయన స్పీడును నేను కూడా అందుకోలేకపోతున్నాను. ఆయనకెందుకంత స్పీడు. ఎవరి కోసం ఆ స్పీడు… కుటుంబాన్ని పట్టించుకోకుండా పనిచేస్తున్నారు.. మన భవిష్యత్తు కోసం.. మన పిల్లల భవిష్యత్తు కోసం…ఆ వయసులో ఆయనకు అంత శ్రమ అవసరమా? ఇవీ నారా లోకేశ్ అన్న మాటలు. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి అయిన లోకేశ్ విశాఖ మహానాడులో మూడోరోజున ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరిని ఉద్దేశించో ఊహించారా… `ఆయన`నుద్దేశించేనండి… ముఖ్యమంత్రీ, తన తండ్రి అయిన చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ లోకేశ్ ఆకాశానికెత్తేశారు. చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నదీ, కష్టపడుతున్నదీ మన బిడ్డలు బాగుండాలనేనని చెప్పారు. కుమారుడిగా లోకేశ్… చంద్రబాబు పనితీరును పొగడ్డం బాగానే ఉంది. ఎవరూ తప్పు పట్టరు. పార్టీ వేదికపైనుంచి మాట్లాడడమే ఎబ్బెట్టుగా ఉందేమో అనిపించింది. తండ్రిని..కొడుకూ… కొడుకును తండ్రీ పరస్పరం ప్రశంసించుకోవడం బాగుండదేమో అనికూడా ఆలోచించడం లేదు. పొగడ్తలు పనితీరును అక్కడే ఆపేస్తాయి…చాలా బాగా చేసేస్తున్నానేమో అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. కొడుకు ప్రతిభను తండ్రి నేరుగా మెచ్చుకోకూడదు. అన్యాపదేశంగా ఆ విషయాన్ని చెప్పాలి. ఇది తాతల కాలం నుంచి మనం చూస్తున్న, అనుభవమే.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి