తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రభావంపై రెండు పూర్తి భిన్నమైన అంచనాలు వినిపిస్తాయి. అభిప్రాయభేదాలు సహజమే గాని రేవంత్ విషయంలో ఈ తేడా చాలా ఎక్కువగా వుంది. ఆయన చాలా సమర్థుడని, ప్రజలు ఆయన పేరు చెబితే వూగిపోతున్నారని ఆయన అనుకూలుల కథనాలు వినిపిస్తుంటాయి. తెలంగాణలో తెలుగుదేశంను బతికించడమే గాక అధికారంలోకి కూడా తెస్తాడనేంతగా వారు మాట్లాడుతుంటారు. మీడియాలోనూ ఒక భాగం ప్రత్యేకించి ఒక పత్రిక రేవంత్‌కు ఆ విధమైన ఉధృత ప్రచారం కూడా ఇస్తుంటుంది. విశాఖ మహానాడులో ఆయనకు వచ్చిన స్పందనపై అనేక కథలు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బలంగా విమర్శిస్తూ మాట్లాడుతుంటే తెలుగుదేశం వారికి బాగా నచ్చడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే హైదరాబాదులో తెలంగాణ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చాక కూడా ఆయన సుదీర్ఘ ప్రసంగం చేయడంపై సీనియర్ తెలుగుదేశం నేతలే విసుక్కున్న సందర్భాలున్నాయి. అయినా విశాఖలోనూ ఆయనను కొంతమంది నేతలు కొన్ని మీడియా సంస్థలూ కావాలనే పైకి లేపడం కనిపించింది. రేవంత్ రెడ్డి వూహించని సంచలనం తీసుకురాగలరనే మాట ఆ వర్గాల్లో బలంగా వినిపిస్తుంటుంది. తన సామాజిక వర్గం గురించి పార్టీలకు అతీతంగా వారి మద్దతు కూడగట్టడం గురించి ఆయన ఎపుడూ మాట్లాడుతుంటారు,..
ఇక రెండో వైపున రేవంత్‌కు రాష్ట్రమంతటినీ ప్రభావితం చేసేంత శక్తి లేదని మరో వాదన. ఆయనో లైట్వైట్ అనీ, ఓటుకునోటు దెబ్బతో అది కూడా పోయిందని వీరంటారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ కేసులో చిక్కుకోవడం వల్ల రేవంత్ కాస్త హద్దుమీరినా ఏమీ అనలేకపోతున్నారని వారంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌తోనైనా కలసి పోటీ చేస్తామని రేవంత్ చెప్పిన మాటను చంద్రబాబు దాటేశారు. పొత్తుల గురించి ఎన్నికలప్పుడే మాట్లాడాలని అన్నారు. రేవంత్ టిఆర్ఎస్ నుంచి వచ్చారు గనక వారికి తగిన విధంగా చతురతతో జవాబులిస్తుంటారని ఒక టిటిడిపి సీనియర్ నేత స్తుతి నింద చేశారు. టిఆర్ఎస్ టిడిపి బిజెపి కలసి పోటీ చేస్తాయని కూడా ఆయన తనదైన జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ఏదో అద్భుతం సాధిస్తారనే మాట టిటిడిపిలో పెద్ద బలంగా లేదు.
అంచనాలు ఎలా వున్నా ప్రతిసారి తీవ్రంగా విరుచుకుపడితేనే అస్తిత్వం ఆధిక్యత నిలబెట్టుకోగలమని రేవంత్ భావిస్తున్నారు. అందుకే ప్రతి అవకాశం అందుకు ఉపయోగిస్తుంటారు. నేరుగా కెసిఆర్ కుటుంబంపైనే విల్లు ఎక్కుపెడుతుంటారు. ఇది వ్యూహాత్మకమా అయితే ఫలితాలిస్తుందా వంటి ప్రశ్నలకు ముందు ముందు సమాధానం రావాలి. బిజెపి కూడా దూరం ప్రకటించాక అనేక మంది పార్టీ ఫిరాయించాక రేవంత్ ఒక్కరి దూకుడు ఏమాత్రం ఫలితాలిస్తుందనేది సందేహమే.