దాసరి నారాయణరావు కంటే ముందు కూడా గొప్ప దర్శకులున్నారు. కాని వారి గురించి సామాన్య ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. పరిశ్రమలో దర్శకుడి స్థానం కూడా వుండాల్సినట్టు వుండేది కాదు. దాన్ని పూర్తిగా మార్చేసి స్టార్ స్టేటస్ ఇవ్వడం ఆయనకే చెల్లింది. తన పేరు మేఘాలపై వేసుకోవడం దర్శకుడిపట్ల గౌరవం ప్రతిష్టించడానికేనని భావించేవారు. మూస ధోరణిని ఛేదించి సింబాలిజం, ఆఫ్‌బీట్, న్యూవేవ్, బడ్జెట్ చిత్రాలవంటివన్నీ ఆయన వచ్చాకే పెరిగాయి. మొదటి చిత్రమే రాజబాబు సత్యనారాయన ఎస్వీఆర్ విజయనిర్మల రాజసులోచన వంటివారితో తీసి ఘన విజయం సాధించారు. 13 చిత్రాల వరకూ వెనక్కు చూసింది లేదు. తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ఫెయిలైతే అదే పరిశ్రమ తనపట్ల ఎలా వ్యవహరించిందో చూశారు. ఈ ఢక్కాముక్కీలు ఆయనను రాటుదేల్చాయి. మొదటి నుంచి చివరి వరకూ ఒక వటవృక్షంలా అందరికీ అండనిచ్చారు. అరవై మంది దర్శకులు ఆయన శిష్యులమంటూ సన్మానం చేశారు. మిగిలిన వారిలా ఒక జానర్‌కు పరిమితమై పోలేదు. తాతమనవడు, మనుషులంతా ఒక్కటే, ఏడంతస్తుల మేడ, యవ్వనం కాటేసింది, కటకటాల రుద్రయ్య, గోరింటాకు, మేఘ సందేశం, శివరంజని, ఒసే రాములమ్మ, ఒరే రిక్షా దేనికదే ఒక జానర్, ఒక సంచలనం, కథ మాటలు కూడా రాయడం తర్వాత పాటలు జోడించడం వెండి తెరను ఆక్రమించేశారాయన. వందల మందిని పరిచయం చేసి నిలబెట్టారు. తనచిత్రాలు కాకున్నా అందరినీ వెన్నుతట్టిప్రోత్సహించేవారు. నటుడుగానూ గొప్ప విజయాలే సాధించారు. ఉదయం పత్రిక కూడా అప్పటికి ఒక సాహస ప్రయోగం. చాలా ఏళ్ల తర్వాత ఈనాడు శైలికి భిన్నమైన అనేక నూతన ప్రయోగాలు ప్రవేశపెట్టింది.ఇప్పుడున్న సంపాదకులలో అత్యధికులు ఉదయంలో తయారైన వారే! సామాజికరంగంలోనూ ముందునిలిచారు. రాజకీయ రంగంలో రాజ్యసభకు రెండుసార్లు వెళ్లడం, కేంద్ర మంత్రిగా వుండటం సహజంగానే వివాదాలలోకి తోసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా ముందు ప్రధాని కార్యాలయాన్ని విచారించండి అని గట్టిగా వాదించారు. ఈ మధ్య కాలంలో నాకు మూడు సార్లు తటస్థపడ్డారు. చర్చలలో అభ్యుదయభావాలు గట్టిగా వినిపిస్తున్నారని . మీరు వచ్చినప్పుడల్లా చూసి ఆనందిస్తుంటానని అభినందించి ఆలింగనం చేసుకున్నారు. అంతకు ముందుకలిసినప్పుడు పత్రికను తిరిగి తీసుకురావాలనే తాపత్రయం చూపించారు. అయితే భార్య పద్మ మరణం ఆయనను బాగా కుంగదీసింది. అయినా ఇటీవల ముద్రగడ పద్మనాభం ఆందోళన తర్వాత ఏర్పడిన సంక్షోభంలో మరోమారు ముందుకు వచ్చి తన పెద్దరికం చూపించారు. ఐసియులో చేరిన తర్వాత ఆయన ఆరోగ్యంపై సందేహాలు బాగా పెరిగాయి గాని ఈ రోజు హఠాత్తుగానే కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి స్థానం సాటిలేనిది. ఆయన లేని లోటు తీరనిది.
దాసరి దర్శక జీవితంలో ఒక కొస మెరుపు చెప్పుకోవచ్చు. బాలచందర్ చిత్రాన్ని తెలుగులో తూర్పు పడమర పేరిట తీసినప్పుడు పైన మేఘంలో ఎవరి పేరు వేసుకోవాలనే చర్చ నడిచింది. చివరకు ఆయన ఆఫీసు బారు గోపాల్ అని వేయించారు.ఇలాటి ఘటన బహుశా ఎక్కడా జరిగి వుండదు.కాని ఆయనకు ఆ సాహసం వుండేది!