ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న సందడి ఈ మధ్య వైకాపాలో కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ అయితే.. ఏ సభకి వెళ్లినా, ఏ కార్యక్రమానికి హాజరైనా కొద్దిరోజుల్లో అధికారంలోకి వచ్చేస్తాం అని చెబుతూ ఉంటారు. ఇక, సాక్షి దిన పత్రిక విషయానికొస్తే… హుటాహుటిన ఆంధ్రా విభాగాన్ని విజయవాడకి తరలిస్తున్నారు. హైదరాబాద్ ఆఫీస్ లోని కొంత సిబ్బందిని అక్కడికి తరలిస్తున్నారు. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నుంచే సిద్ధమవ్వాలన్న హడావుడి వైకాపా వర్గాల్లో కనిపిస్తోంది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి చెందిన నేతల వ్యాఖ్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అధికార పక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడని విధంగా ఉండాలి. కానీ, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నట్టుగానే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు చేశారు. మహానాడులో లోకేష్ మాట్లాడటానికి వెళ్తుంటే చంద్రబాబు ముఖంలో ఆందోళన కనిపించందన్నారు. సరిగా మాట్లాడటం రాని వ్యక్తి, జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లోకేష్ పై వేల కోట్ల అవినీతి ఆరోపణలున్నాయనీ, దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఎంక్వరీ వేసేంత ధైర్యం, దమ్ము చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఓకే.. ఇంతవరకూ బాగానే విమర్శించారు అనుకుందాం. కానీ, అసలు విషయం తరువాత ఉంది!
రాష్ట్ర అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారంటూ ఎప్పటికప్పుడు టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని తిప్పి కొట్టే క్రమంలో అంబటి మాట్లాడుతూ… అభివృద్ధికి కొలమానంగానే జీడీపీని చెబుతారనీ, ఆంధ్రాలో 12.7 శాతం వృద్ధి సాధిస్తున్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఎక్కడ అడుపడుతున్నట్టు అని ప్రశ్నించారు. జీడీపీని ఎక్కువగా చూపించి అప్పులు తెస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపై తమ పోరాటం కొనసాగుతుందని అంబటి అన్నారు.
వైకాపాని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు ఇవే! జగన్ అభివృద్ధి నిరోధకుడు అంటున్న టీడీపీకి చెప్పాల్సిన సమాధానం ఇది కాదు కదా! 12.7 వృద్ధి రేటును తెలుగుదేశం సర్కారు సాధించిందని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే అంబటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, జీడీపీని అధికంగా చూపించి అప్పులు తెస్తున్నారన్నారు! అదీ ఓరకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యాఖ్యే! రాష్ట్రం పేదరికంలో ఉంది కాబట్టి, ఎలాగోలా అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని చెబుతున్నట్టుగానే ఉంది. ఇక, ప్రత్యేక హోదా విషయమై భాజపాతోనే పోరు ఉంటుందన్నారు. నిజానికి, కేంద్రంపై వైకాపా బలంగా విమర్శించిన సందర్భాలేవీ..? ఉంటేగింటే ఆ పోరాటమేదో టీడీపీపై ఉండాలి. టీడీపీ ఫెయిల్యూర్ ని ఎండగట్టాలి. భాజపా వైఫల్యం గురించి వైకాపా మాట్లాడితే ఏం ప్రయోజనం..? మొత్తానికి, ఈ విషయంలో అంబటి వ్యాఖ్యలు సెల్ఫ్ గోల్స్ అయినట్టే కదా!