దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు సినీలోకమంతా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులూ దాసరి పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పిస్తున్నారు. ఈ తరుణంలో దాసరి కుటుంబంలోని లుకలుకలు బయటపడటం విశేషం! దాసరి నారాయణ రావు పెద్ద కోడలు మీడియా ముందుకు వచ్చారు. ఆయన మరణంపై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పడం చర్చనీయంగా మారింది. ఓ నాలుగైదు రోజుల కిందటే మామగారిని కలిశాననీ, చాలా బాగున్నారనీ, ఇంతలోనే ఆయన ఆరోగ్యం అంత తీవ్రంగా ఎలా దెబ్బతిందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన దాసరి పెద్ద కోడలు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను బహిర్గతం చేశారు.
దాసరికి ఇద్దరు కుమారులు.. ఒక కుమార్తె. కొడుకుల్ని సినీరంగంలోకి తీసుకుని రావాలని దాసరి ప్రయత్నించారు. కానీ, వర్కౌట్ కాలేదు. చిన్నకుమారుడు దాసరి అరుణ్ కుమార్ కొన్ని సినిమాల్లో నటించినా… ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయారు. ఇక, పెద్ద కుమారుడు తారక ప్రభు విషయానికొస్తే.. మొదట్నుంచీ తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయని అంటారు. ముఖ్యంగా అతడి పెళ్లి విషయంలో దాసరి పంతం పట్టారని అప్పట్లో అనుకునేవారు. అంతేకాదు, 2008 లో దాసరి పెద్ద కుమారుడు కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. తన నుంచి భర్తను వేరు చేయడం కోసమే కిడ్నాప్ చేయించారని పెద్ద కోడలు సుశీల అప్పట్లో ఆరోపించారు. ఇక, ఇప్పటి విషయానికొస్తే తారక ప్రభు, సుశీల కొన్నాళ్లుగా విడివిడిగానే ఉంటున్నారని చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట ఇద్దరి మధ్యా రాజీ కుదిరినా… తరువాత విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు.
అయితే, దాసరి మరణంతో సుశీల మీడియా ముందుకు రావడం విశేషం. తనకు న్యాయం చేస్తానని దాసరి హామీ ఇచ్చారనీ, తన కుమారుడు దాసరి నారాయణరావు (తాత పేరే పెట్టారు)ను హీరోగా పరిచయం చేస్తానని చెప్పారనీ, ఓ చిన్న సర్జెరీ ఉందనీ, ఓ వారంలో తాను డిశ్చార్జ్ అయిపోతాననీ దాసరి తనతో చెప్పినట్టు సుశీల అంటున్నారు. ఆస్తుల విషయంలో కూడా తనకు న్యాయం చేస్తానని మామగారు చెప్పారంటూ సుశీల మీడియాకు చెప్పారు. ఏదేమైనా, పెద్దాయన మరణించి 24 గంటలు గడవక ముందే ఇలా ఆస్తులంటూ, వారసులకు ఇచ్చిన హామీలంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాస్త ఇబ్బందికరమైన ఇష్యూనే! ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి, తెర వెనకే ఉంటే కాస్త బాగుండేది కదా!