బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, బలాబలాలు మారిపోతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ జనతా పరివార్ నుంచి తప్పుకొని ఒంటరి పోరుకి సిద్దం అయ్యేరు. అది చూసి చాలా సంతోషిస్తున్న బీజేపీకి బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ షాక్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో నుండి దిగిపోయిన తరువాత ‘హిందుస్తానీ అవామీ మోర్చా’ అనే పార్టీని స్థాపించి ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా చేరారు. దళితవర్గానికి ప్రతినిధి అయిన జితన్ రామ్ మంజీ మద్దతు బీజేపీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. కానీ ఎన్డీయే కూటమిలో చాలా కాలంగా భాగస్వామిగా ఉన్న ‘లోక్ జన శక్తి’ అధినేత రామ్ విలాశ్ పాశ్వాన్ తనే దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. కనుక ఇప్పుడు వారిద్దరిలో దళితులకు ఎవరు సిసలయిన ప్రతినిధి? అనే వివాదం మొదలయింది.
యావత్ భారతదేశంలో దళితులకు తనే ఏకైక ప్రతినిధిని కనుక తమ పార్టీకి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 75 సీట్లు కేటాయించాలని రామ్ విలాశ్ పాశ్వాన్ పట్టుబడుతున్నారు. ఆయన అంతవరకే పరిమితమయితే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదేమో కానీ ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “జితన్ రామ్ మంజీ తాత్కాలికంగా మా ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్నారు,” అని పాశ్వాన్ చెప్పడంతో జితన్ రామ్ మంజీ తీవ్ర ఆగ్రహం చెందారు.
“అసలు ఇంతవరకు బీహార్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని లోక్ జన శక్తి అధినేత రామ్ విలాశ్ పాశ్వాన్ 75 సీట్లు కోరడమే తప్పు. పైగా మా పార్టీ 13మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రాకుండా అడ్డు పడటం మరో తప్పు. ఆ 13 సీట్లకు అదనంగా మరికొన్ని సీట్లు మేము కోరుతున్నాము. మాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎన్డీయే నష్టపోతుంది. అసలు దళితుల సమస్యల గురించి ఎన్నడూ మాట్లాడని రామ్ విలాశ్ పాశ్వాన్ తను దళితులకు ప్రతినిధినని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది,” అని మంజీ అన్నారు.
జనతా పరివార్ లో చీలిక వచ్చిందని బీజేపీ సంతోషిస్తుంటే ఇప్పుడు ఎన్డీయేలో కూడా రెండు పార్టీలు సీట్ల కోసం కొట్లాడుకొంటూ మీడియాకి ఎక్కడంతో బీజేపీ అధిష్టానం చాలా ఆందోళన చెందుతోంది. రామ్ విలాశ్ పాశ్వాన్ చాలా కాలంగా ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటున్నారు కనుక ఒకవేళ ఆయనకే ఎక్కువ సీట్లు కేటాయించినట్లయితే వాళ్ళు గెలుస్తారనే నమ్మకం లేదు. పైగా మంజీని పక్కనబెడితే ఆయన ఎన్డీయే కూటమి నుండి బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అలాగని మంజీకి ఎక్కువ సీట్లు కట్టబెడితే పాశ్వాన్ అలగవచ్చును.
జనతా పరివార్ లో మిగిలిన ఐదు పార్టీలు నేటికీ సీట్ల కోసం ఇంకా కొట్లాడుకొంటూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్డీయేలో పార్టీలు కూడా కొట్లాడుకోవడం చూసి జనతా పరివార్ కూడా చాలా సంతోషిస్తోంది. ఈసారి వామపక్షాలు కూడా ఒక కూటమిగా ఏర్పడి బీహార్ ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. అంటే జనతా పరివార్, ఎన్డీయే, వామ పక్ష కూటమిలతో కలిపి మొత్తం మూడు కూటములు ఎన్నికల బరిలో ఉన్నాయన్నమాట. ఈ మూడు కాకుండా ములాయం సింగ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ, వందలాది స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉంటారు. కనుక ఈసారి ఎన్నికలలో ప్రజల ఓట్లు వారందరి మధ్య చీలిపోయే అవకాశాలు కనబడుతున్నాయి.