తమిళనాడు రాజకీయాలు మళ్లీ హాట్ హాట్ గా మారుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ తెర వెనక శరవేగంగా జరుగుతున్నాయని అంటున్నారు. 2019 ఎన్నికల బరిలోకి దిగేందుకు అనుగుణంగానే సూపర్ స్టార్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. రజనీ ఏర్పాటు చేయబోతున్న పార్టీ కోసం బెంగళూరుకు చెందిన ఒక సంస్థ చాలా కృషి చేస్తోందనీ అంటున్నారు. అయితే, ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికారంలో ఉన్న భాజపా ఎలాంటి ఎత్తుగడలతో సిద్ధమౌతోందన్నదే ఆసక్తికరంగా మారింది.
తమిళ రాజకీయాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసం భాజపా శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అమ్మ జయలలిత మరణం తరువాత తమిళనాడును తమ అధీనంలోకి తెచ్చుకోవడం కోసం తెరవెనక చాలా ఎత్తులే వేసింది. కానీ, శశికళ వర్గం కొంతవరకూ బాగానే అడ్డుకుంది. ఆ తరువాత అనూహ్యంగా శశికళ జైలుకు వెళ్లడంతో పరిస్థితి మారింది! ఎలాగోలా పన్నీర్ సెల్వం వర్గాన్ని భాజపా దారిలోకి తెచ్చుకుంది. ఇప్పుడు భాజపా టార్గెట్… చిన్నమ్మ వర్గం. వారిని అన్ని విధాలుగా వీక్ చేయడం కోసం ఈ మధ్య రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే క్రమంలో రజనీకాంత్ సేవల్ని కూడా భాజపా వినియోగించుకునేందుకు సిద్ధమౌతోందట! నిజానికి, రజనీని భాజపాలోకి ఆహ్వానించేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది భాజపా ప్రముఖులు కూడా ఆయనకి ఆహ్వానాలు పంపారు. అయితే, ఆ సమయంలో రజనీ స్పందించలేదు. ఇప్పుడు ఎలాగూ సొంత పార్టీ పెడతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజినీకి తమ మద్దతు ప్రకటించేందుకు భాజపా సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
ఈ ఏడాది ద్వితీయార్థంలో పార్టీ ఏర్పాటు ఉంటుందనీ, వచ్చే ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీకి దిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనీ, కొత్త పార్టీ అయినప్పటికీ ఎన్నికల బరిలోకి దిగడానికి కావాల్సిన సాధనాసంపత్తిని భాజపా సమకూర్చుతుందంటూ జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. రజనీకి అన్ని విధాలుగా మద్దతు ఇవ్వడం ద్వారా.. తమిళనాడులోని ఇతర ప్రాంతీయ పార్టీలపై కూడా పోరాటం చెయ్యొచ్చనేది భాజపా వ్యూహంగా ఉందని అంటున్నారు. మొత్తానికి, రజనీ పొలిటికల్ ఎంట్రీపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై భాజపా ప్రభావం ఉంటుందనేది నిర్వివాదాంశం. అమ్మ మరణం దగ్గర నుంచీ భాజపా తీరును గమనిస్తూనే ఉన్నాం కదా!