తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ పాలిటిక్స్ లోకి వస్తారంటూ చర్చ జరుగుతోంది. పార్టీ ఏర్పాటుకు సిద్ధమంటూ కథనాలు వస్తున్నాయి. 2019 ఎన్నికలకు తలైవా సిద్ధమౌతున్నారనీ, ఈ ఏడాది ద్వితీయార్థంలో పార్టీ ప్రకటన ఉంటుందంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ గురించి కూడా చర్చ మళ్లీ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీకి సిద్ధమని ప్రకటించిన జనసేనాని ప్రస్తుతం ఏం చేస్తున్నట్టు..? ఆ దిశగా పార్టీని నిర్మించే పనిలో ఉన్నారా..? క్యాడర్ ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారా..? దశలవారిగా నాయకుల్ని ఎంపిక చేసుకుంటున్నారా..? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే, ప్రశ్నలన్నింటికీ మౌనమే సమాధానం అని చెప్పుకోవాలి!
సంస్థాగతంగా జనసేన పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ముందడుగులూ పడటం లేదనే తెలుస్తోంది! వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేస్తాం అని ప్రకటించారే తప్ప… ద్వితీయ శ్రేణి నాయకత్వం గురించిగానీ, పార్టీ క్యాడర్ నిర్మాణం విషయంలోగానీ అనూహ్య పురోగతి కనిపించడం లేదంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి, ఈ మధ్య పవన్ దూకుడు కూడా కాస్త తగ్గింది. కొన్ని ప్రెస్ నోట్లు విడుదలకే పరిమితం అవున్నారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థమైనట్టే! అందుకే, ఒంటరి పోరు అనే టాపిక్ జోలికి కూడా వెళ్లడం లేదు. కేవలం భాజపాపై విమర్శలతోనే టైంపాస్ చేస్తూ వస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం చాటునే జనసేన ఉండాల్సిన పరిస్థితి వస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, పవన్ సోలోగా ఎన్నికలకు వెళ్తే.. తెలుగుదేశం పోరాటం వేరేలా ఉంటుందనీ, దాన్ని తట్టుకునేంత స్థాయి ప్రస్తుతానికి జనసేనకు లేదని విశ్లేషకుల అభిప్రాయం. పవన్ సోలోగా ముందుకెళ్లాలని అనుకుంటే… మీడియా సపోర్ట్ కూడా లభించకపోవచ్చనీ, ప్రస్తుతం ప్రాధాన్యత ఉంటోందంటే కారణం టీడీపీ చాటు పార్టీగానే జనసేనను కొన్ని వర్గాలవారు చూస్తున్నాయని గ్రహించాలనీ అంటున్నారు! లేదూ.. పవన్ ఒంటరి పోరాటం చేస్తారని పక్కాగా రూఢి అయిందా.. వారి ట్రీట్మెంట్ మరోలా ఉంటుందని అనడంలో సందేహం లేదు!
అయితే, పవన్ కు కావాల్సినంత క్రేజ్ ఉంది కదా… ఎందుకీ మీనమేషాల లెక్కింపూ అంటే, దానికీ కారణముంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఇలానే అంచనా వేశారు. చిరంజీవి సభలకు అశేష జనవాహిని తరలి వస్తుంటే.. ఆంధ్రా రాజకీయాల్లో మరో అద్భుతం ఆవిష్కృతం అవుతుందని అంచనా వేశారు. కానీ, చివరికి ఏమైంది..? ఒక సూపర్ స్టార్ గా అభిమానం పొందడం వేరు, ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో కన్వర్ట్ చేసుకోవడం వేరనేది తేలింది. అన్నయ్యకు ఎదురైన అనుభవం పవన్ కు తెలియంది కాదు! అర్థం చేసుకోలేనిది అంతకన్నా కాదు. అందుకే, జనసేనాని కాస్త జాగ్రత్తగా ఉంటున్నట్టు చెప్పుకోవాలి. ఈ మధ్య ఒంటరి పోరు అనే మాట జోలికి వెళ్లకపోవడం వెనక కారణం ఇదే కావొచ్చు.