టీవీ చర్చలు పక్కదారి పడుతూనే ఉన్నాయి. సమాధానం చెప్పలేని ప్రశ్నలు..సమర్థించుకోలేని అంశం ఎదురైనప్పుడు రాజకీయ నాయకులు ఎదురుతిరుగుతారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు ఇది అలవాటుగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం లేని కాంగ్రెస్ పార్టీ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. తాజాగా ఈరోజు సాక్షి చానెల్లో నిర్వహించిన కెఎస్ఆర్ లైవ్ షోలో శైలజానాథ్ వ్యాఖ్యలు ఇందుకు తాజా ఉదాహరణ. సందర్భం ఏదైనా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి గురించి ప్రస్తావించారు. ముందాయన్ను భార్యను తన దగ్గరకు తెచ్చుకోమనండంటూ వ్యాఖ్యానించారు. టీవీలో చర్చకూ ప్రధాని నరేంద్ర మోడీ తన భార్యతో విడిగా ఉండడానికీ సంబంధమేమిటి? వ‌్యక్తిగత అంశాలను ఎందుకు ప్రస్తావిస్తారు. ఆయన వ్యాఖ్యల్లో బీజేపీ మీద బురద జల్లి లబ్ధి పొందే యోచనే తప్ప వేరొకటి కనిపించడంలేదు. ప్రజా ప్రయోజనాలు.. ప్రజా సమస్యలపై వారి దృష్టే ఉండదు. ప్రజా సమస్యల ముసుగు కప్పి సొంత విషయాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో సమన్వయకర్త కూడా అదుపు చేసే ప్రయత్నం చేయరు. ఆయనకు కావల్సింది. టిఆర్పీ రేటింగ్. దీనికి తోడు చానెల్ అధినేత చల్లని చూపులూ… టీవీ చర్చలలో ప్రస్తావించడానికి ఇంతకన్నా హీనమైన అంశాలూ ఉన్నాయి. సభ్యత కారణంగా వాటిని గుర్తుచేసుకోకపోవడమే మంచిది. టైమ్స్ నౌ చానెల్ వీటన్నిటికీ మాతృక. ప్రజా సమస్యలపై దృష్టిపెడితే చానెళ్ళకు మంచి పేరొచ్చే అవకాశముంటుంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి