దాసరి నారాయణ రావు దగ్గర ఎప్పుడూ కథలకు కొరత ఉండేది కాదు. ఎందుకంటే ఆయన స్వతహాగా మంచి రచయిత. కథ రాయడానికి పెద్దగా సమయం కూడా తీసుకొనేవారు కాదు. కథ రాశానరంటే అది పట్టాలెక్కేయాల్సిందే. అయితే ఓ కథ మాత్రం… పట్టాలెక్కలేదు. `నర్తకి` అనే స్క్రిప్టు సిద్ధం చేసుకొన్న దాసరి.. దాన్ని సినిమాగా తీద్దామనే ప్రయత్నాలు మొదలెట్టి కూడా వదిలేయాల్సివచ్చింది. ఎందుకంటే సరిగ్గా అదే టైమ్‌లో `శంకరాభరణం` వచ్చిందట. ఆ కథ తాను రాసుకొన్న నర్తకి దగ్గరగా ఉండడంతో ఆ కథని వదిలేశార్ట. అయితే చిన్న చిన్న మార్పులు చేసి, ఆ సినిమాని జయప్రద ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించాలని భావించార్ట. అయితే… అదీ సాధ్యం కాలేదు. ఈ జనరేషన్లో నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమా తీయాలనుకొంటే.. నర్తకి గుర్తొచ్చేదట. అయితే జయప్రదకి సరితూగే కథానాయిక దొరక్కపోవడంతో.. నర్తకి కథని తీసుకురాలేకపోయారు దాసరి. అంతేకాదు.. మహాభారతం గాథని తెరకెక్కించాలన్నది దాసరి కల. 5 భాగాలుగా ఈ సినిమాని తీయాలనుకొన్నారు దాసరి. అదీ.. తీరలేదు. చివరి రోజుల్లో పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలని తపించారు. పవన్ కూడా అందుకు సై అన్నాడు. అయితే సరైన కథ దొరక్కపోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.