తనదైన శైలిలో రెండు తెలుగు రాష్ట్రాలకూ శుభాకాంక్షలు చెప్పారు మోడీ. తెలంగాణా ప్రజలకు చెప్పిన శుభాకాంక్షలు రొటీన్ వ్యవహారం అన్నట్టే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కాస్త తెలివితేటలు వాడేశారు మోడీ. ఎంతైనా కాంగ్రెస్, బిజెపి కలిసి చేసిన విభజనలో నష్టపోయిన రాష్ట్రం. ఆ తర్వాత మోడీవారి పాలనలో మూడేళ్ళుగా నష్టపోతూనే ఉన్న రాష్ట్రం కదా. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాటలతో ఆనందపరిచే ప్రయత్నం చేశారు. డైనమిక్ పీపుల్ ఆఫ్ ఆంధ్రా అంటూ ఆకాశానికెత్తేశారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్ళాలని….ఇప్పటిలానే భారతదేశ అభివృద్ధికి ఎప్పుడూ తోడ్పడుతూ ఉండాలని అభిలషించాడు మోడీ.
ప్రజా ప్రయోజనాల కంటే కూడా వ్యాపారాలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సీమాంధ్ర నాయకులను నమ్ముకుని నిండా మునిగిన సీమాంధ్ర ప్రజలను రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా మాటలతోనే ఆనందపరచాలని అనిపించింది మోడీకి. రాజధాని శంకుస్థాపనకు వచ్చని సందర్భంలో కూడా అదే తీరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశం కోసం ఏం చేయాలో చెప్పాడు. కాకపోతే అభివృద్ధిలో హైట్స్‌కి వెళ్ళే విషయం పక్కన పెడితే స్థిరంగా నిలబడడానికే అపసోపాలు పడుతున్న అత్యంత వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ ఏం చేస్తున్నాడు? ఏం చేయబోతున్నాడు అనే విషయాలను మాత్రం కనీసం ప్రస్తావించలేదు మోడీ. విభజన జరిగిన రోజు వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాస్త బాధ ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి సందర్భాల్లో కూడా ఎప్పుడూ చేసినట్టుగా మాటలతో ఆనందపరిచే ప్రయత్నం కంటే కూడా చేతల్లో ఏమైనా చేసి ఉంటే న్యాయంగా ఉండేదేమో మోడీజీ.