ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో చేసిన ఎన్నో తప్పులకు గానూ అంతే స్థాయిలో మూల్యం చెల్లించింది కాంగ్రస్ అధిష్టానం. 2004, 2009 ఎన్నికల్లో అత్యధిక స్థాయిలో కాంగ్రెస్ ఎంపిలను గెలిపించి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిగా సహకరించిన తెలుగు ప్రజలందరికీ దూరమైంది. ఆంధ్రప్రదేశ్‌లో డిపాజిట్స్ కూడా తెచ్చుకోలేని స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ తెలంగాణాలో కూడా అధికారంలోకి రాలేకపోయింది. వైఎస్ చనిపోయిన తర్వాత నుంచీ వరుసగా ఎన్నో తప్పులు చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇన్నాళ్ళకు కాస్త బుర్ర ఉపయోగించింది.
తెలంగాణాలో పర్యటించిన వెంటనే రెండో తేదీన గుంటూరుకు వస్తానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు చెప్పాడు రాహుల్ గాంధీ. అయితే స్థానిక కాంగ్రెస్ నాయకులు మాత్రం రాహుల్ నిర్ణయానికి భయపడిపోయారు. తెలంగాణా ఇచ్చింది మేమే. తెలంగాణా ప్రజల అభిలాషను గుర్తించి, తెలంగాణా ప్రజలపైన ప్రేమతో రాష్ట్రం ఏర్పాటు చేశామని చెప్పి తెలంగాణాలో మాట్లాడిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే విభజనతో గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాహుల్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ఖాయమని వాళ్ళు రాహుల్‌తో చెప్పారట. మామూలుగా అయితే కాంగ్రెస్ అధిష్టానం స్థానిక కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలకు అస్సలు విలువ ఇవ్వదు. అయితే ఇప్పుడు రాష్ట్రాలలోనూ, దేశవ్యాప్తంగానూ పూర్తిగా కుంగిపోయి ఉన్న దశలో కాస్త స్థానిక నాయకుల మాట కూడా వింటున్నట్టుగా ఉన్నారు. అందుకే తన ఆంధ్రప్రదేశ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు రాహుల్‌గాంధీ. రాజకీయంగా ఇది కాస్త తెలివైన నిర్ణయమే. అయినప్పటికీ తెలంగాణాలో పర్యటించినప్పుడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో కెసీఆర్‌తో సహా ఎవ్వరి పాత్రాలేదు. సర్వం మేమే…మా నిర్ణయమే అని చెప్పిన రాహుల్ గాంధీ ఎపిలో ఏం మాట్లాడి ప్రజలను మెప్పిస్తాడు? ఎపిలో సభలో కోసం కేటాయించే నిధులు, టైం ఏదో తెలంగాణాలోనే ఖర్చుపెడితే బెటర్ ఏమో. ఎందుకంటే ఎపిలో ఇంకో దశాబ్ధం వరకూ కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు కాదు కదా…….డిపాజిట్స్ దొరకడం కష్టమే అని విశ్లేషకులు చెప్తున్నారు మరి.